కైలాస్‌నగర్: పీఏసీఎస్‌ల అభివృద్ధికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం 99వ మహాజన సభ నిర్వహించారు. కలెక్టర్, బ్యాంక్ ప్రత్యేకాధికారి అధ్యక్షతన సాగిన సమావేశంలో జిల్లాలోని సొసైటీల అభివృద్ధి, రుణాలు, ప్రభుత్వ పథకాల అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇచ్చోడ, గుడిహత్నూర్, తాంసి, బజార్‌హత్నూర్ సొసైటీల పరిధిలో కనీసం మూడెకరాల భూసేకరణను పూర్తి చేసి మార్కెట్ యార్డులు, గోదాముల నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోలార్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుందని సూచించారు. అలాగే, ప్రైవేట్ సంస్థలు, ఆసక్తిగల వ్యక్తుల భాగస్వామ్యంతో పీఎం కుసుమ్ సోలార్ పంపు సెట్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. సొసైటీల్లో డిపాజిట్లను పెంచడంతో పాటు ఎన్‌సీడీసీ ద్వారా తక్కువ వడ్డీకి లభించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా స్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న చిన్నచిన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ మేలు జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ ఆర్.ఎస్.చిత్రూ, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల సహకార అధికారులు సత్యనారాయణ, కరుణాకర్, నాబార్డు డీడీఎం అబ్దుల్ రౌఫ్, బ్యాంక్ సీఈవో చండీ, విశ్వేశ్వర్, సొసైటీల అధ్యక్షులు, బ్యాంక్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


