కాసిపేట: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సింగరేణి యాజమాన్యం కృషి చేస్తోందని మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ తెలిపారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో ఆర్పీ అండ్ ఎన్సీఆర్ఏపీ పథకం ద్వారా మంజూరైన రూ.63.50లక్షలతో ఆర్వో ప్లాంట్లు, సోలార్ స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, ఓపెన్‌జిమ్ తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.30లక్షల వ్యయంతో కాసిపేట, ముత్యంపల్లి, చిన్నధర్మారం, అశోక్‌నగర్ గ్రామాల్లో ఆర్వో వాటర్ప్లాంట్లు, రూ.10లక్షలతో సోలార్ స్ట్రీట్ లైట్లు, రూ.16లక్షలతో మూడు కల్వర్టులు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో నేపథ్యంలో నీటిని వృథా చేయవద్దని సూచించారు. సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తోందని చెప్పారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి పూస్కూరి విక్రమ్‌రావు, ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేశ్, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రత్నం సుకుమారి, ఆత్మ చైర్మన్ రౌతు సత్తయ్య, డీజీఎం మదీనా భాష, ఎన్విరాన్మెంట్ అధికారి వెంకటరెడ్డి, సర్పంచులు నీల రాంచందర్, భూక్య స్వప్న, చాకటి సుగుణ, ఉపసర్పంచులు రమేశ్, సందీప్ పాల్గొన్నారు.


