మంచిర్యాలరూరల్(హాజీపూర్): కార్మికులకు నష్టం చేకూర్చే లేబర్ కోడ్స్‌ను రద్దు చేస్తూ హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్‌కుమార్ డిమాండ్ చేశారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేటలోగల లిక్కర్ గోదాం వద్ద బేవరేజెస్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 26న తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలకు ఆదాయాన్ని తీసుకువచ్చే హమాలీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చూడటం సరికాదని పేర్కొన్నారు. హమాలీలకు నెలకు రూ.9వేల పెన్షన్, రూ.25లక్షల ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా హక్కుల సాధనకు 26న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన మహాధర్నాలో జిల్లాలోని అన్ని రకాల హమాలీ కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు పూదరి శ్రీనివాస్, బైరి రమేశ్, కోశాధికారి సల్ల మహేందర్ పాల్గొన్నారు.


