మందమర్రిరూరల్: సింగరేణిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఈ నెల 25న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు సీఐటీయూ కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మందమర్రి ఏరియాలోని కేకే–5 గనిపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సింగరేణి సంస్థకు ఉన్న విద్యుత్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. గుర్తింపు యూనియన్ సింగరేణి సంస్థతో చేసుకున్న ఒప్పందాలు వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలని కోరారు. సింగరేణిలో కొత్తగా అమలు చేస్తున్న లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, సంస్థలో రాజకీయ జోక్యం వద్దని డిమాండ్ చేశారు. యూనియన్ ఏరియాధ్యక్షుడు వెంకటస్వామి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నాయకులు రాజేందర్, ఆదర్శ్, సత్యనారాయణ, వెంకటేశ్ తదితరులున్నారు.


