సరుకుల గోదాం మూసివేత..! | - | Sakshi
Sakshi News home page

సరుకుల గోదాం మూసివేత..!

Oct 24 2026 12:10 AM | Updated on Oct 24 2026 12:10 AM

పంపిణీపై వీడని చిక్కుముడి

పాత గోదాం ఇంచార్జి తొలగింపు..?

కొత్తవారికి బాధ్యతలు కట్టబెట్టిన నాకాఫ్‌

రూట్‌ సర్వే, సాంకేతిక కారణాలతో సరఫరా మరింత ఆలస్యం

సంక్షేమ గురుకులాలు ప్రిన్సిపాళ్లు, హాస్టల్‌ వార్డెన్లు, కేజీబీవీల ప్రత్యేక అధికారులకు తప్పని ఇక్కట్లు

మంచిర్యాలఅర్బన్‌: మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ రెసిడెన్షియల్‌, హాస్టళ్లు, కేజీబీవీలకు సరుకుల సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. దసరా సెలువులు ముగిసి విద్యార్థులు తిరిగి హాస్టళ్లకు చేరుతున్న తరుణంలో వంట సరుకులకు నిర్ధేశించిన గడువు(22నుంచి నవంబర్‌ 5లోపు) సమీపిస్తున్నా క్షేత్రస్థాయిలో సరఫరా నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. సరుకులు నిల్వ చేసే నస్పూర్‌లోని గోదాం మూతపడడంతో సరుకుల రవాణా పూర్తిగా నిలిచిపోయింది. నాకాఫ్‌ నుంచి సరుకులు సరఫరా లేకపోవడం, గోదాంలో అరకొరగా ఉండడంతో ఏం చేయాలో తెలియక మూసి వేసినట్లు తెలుస్తోంది. గోదాం మూసివేతతో కొత్త ఏజెన్సీల ద్వారా సరుకులు పంపిణీ చేస్తారా లేదా అనే సందిగ్ధత నెలకొంది. ఇదివరకు అరకొర సరఫరా చేసిన సరుకులకు సంబంధించిన బిల్లుల పై ధరలు లేకపోవడం అయోమయంలో పడేస్తోంది. నాకాఫ్‌ సంస్థ ప్రతినిధులు, గోదాం ఇన్‌చార్జిలు సరుకుల పంపిణీపై మీనమేషాలు లెక్కిస్తుండడంతో విద్యార్థులకు ఇక్కట్లు ఎదురు కానున్నాయి.

పంపిణీపై పర్యవేక్షణ ఏది?

వసతిగృహాలు, సంక్షేమ గురుకులాలు, కేజీబీవీలకు సరుకుల పంపిణీపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. జిల్లా స్థాయిలో టెండర్లు పిలిచి సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్‌పై ఉన్న అధికారుల శ్రద్ధ రెండు నెలలు గడుస్తున్నా సరకుల పంపిణీలో తడబడుతున్న నాకాఫ్‌ సంస్థపై లేకపోవడంపై పెదవి విరుస్తున్నారు. దసరా సెలవుల తర్వాత పాఠశాలలకు తిరిగి వస్తున్న విద్యార్థులకు భోజనం కల్పించడం వసతిగృహ వార్డెన్లు, వసతితో కూడిన విద్యాలయాల ప్రిన్సిపాళ్లు, ప్రత్యేక అధికారులకు తలకు మించిన భారంగా మారుతోంది. అక్టోబర్‌లో పండుగకు ముందు పది రోజులు కోసం పాత కాంట్రాక్టర్‌, దుకాణాల్లో సరుకులు కొనుగోలు చేసి నెట్టుకొచ్చారు. ప్రస్తుతం గోదాం ఇంచార్జి నుంచి సమాధానం లేకపోవడం, శుక్రవారం గోదాం మూసివేయడంతో సరుకులు రాకపోతే విద్యార్థులకు అన్నం ఎలా పెట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకాఫ్‌ సంస్థ నుంచి సరుకులు సరఫరా అయ్యే వరకు ప్రత్యామ్నాయంగా పాత కాంట్రాక్టర్‌కు సరుకుల పంపిణీ బాధ్యతలు అప్పగిస్తే కొంతమేర ఊరట కలుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement