చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) పనులు ముందుకు సాగడం లేదు. ఇద్దరు రాష్ట్ర మంత్రులు శంకుస్థాపన చేసి తొమ్మిది నెలలు గడుస్తుండగా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలో గత జనవరి 19న రూ.47.50కోట్లతో ఏటీసీ నిర్మాణానికి రాష్ట్ర కార్మిక మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. దీంతో ఆధునిక సాంకేతిక కేంద్రం ఏర్పాటు అవుతుందని చెన్నూర్, కోటపల్లి మండలాల యువతీ, యువకులు సంతోషించారు. తొమ్మిది నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పనులు ప్రారంభిస్తే ఇప్పటివరకు పూర్తయ్యేవి. నిరుద్యోగులకు సాంకేతిక విద్య అందని ద్రాక్షగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి ఏటీసీ కేంద్రం పనులు త్వరితిగతిన ప్రారంభించేలా ప్రత్యేక చొరవ చూపించాలని నిరుద్యోగ యువతీ, యువకులు మహేశ్, స్వాతి కోరారు.


