జైపూర్: ఓ వైపు విద్యుత్ సరఫరాలో అంతరాయం.. మరోవైపు బోరులో నీరు అడుగంటడంతో చివరి దశలో ఉన్న వరి పంట సంరక్షణకు రైతు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని మిట్టపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ రామటెంకి దేవయ్య గ్రామంలో మూడున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. వరి గింజలు పాలుపోసుకుని చివరి దశకు చేరుతున్న తరుణంలో కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో బోరు సరిగ్గా పోయడం లేదు. ఓ వైపు తడిస్తే మరోవైపు పొలం నెర్రెలు బారుతోంది. పంటను కాపాడుకోవాలని బోరుతోపాటు ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా నీరు పారిస్తున్నాడు. ట్రాక్టర్ ట్యాంకర్ రూ.800 చొప్పున శుక్రవారం ఒక్క రోజే 12 ట్రిప్పులు నీరు తెప్పించినట్లు తెలిపాడు.


