మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కోల్‌బెల్ట్ రహదారి గుండా బొగ్గు రవాణా చేసే టిప్పర్ డోర్‌కు ఉండే లాక్ పిన్నులు ఊడిపోయి టిప్పర్లోని బొగ్గు కొంత స్థానిక సివిల్ కార్మికుల డిస్ట్రిబూషన్ పాయింట్ ఆఫీస్ వద్ద రహదారిపై పడి వాహనదారులకు ఇబ్బందిగా మారింది. బుధవారం రామకృష్ణాపూర్ సీఎస్పీ వైపు వెళ్తున్న సింగరేణికి సంబందించిన టిప్పర్ పిన్నులు స్పీడ్ బ్రేకర్ వద్ద ఒక్కసారిగా ఊడిపోవడంతో రోడ్డుపై బొగ్గు పడిపోయింది. విషయాన్ని గమనించిన డ్రైవర్ కొంచెం ముందుకు వెళ్లి టిప్పర్‌ను నిలిపివేశారు. టిప్పర్ లోడ్ చేసిన తర్వాత డోర్ పిన్నులు సరిగా పట్టక పోవడంతోనే ఇలా జరిగిందని పలువురు పేర్కొన్నారు.


