మంచిర్యాలఅర్బన్: జిల్లాలో దసరా సంబరాలు అంబరాన్నంటాయి. మంగళవారం జిల్లాలోని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. మంచిర్యాలలో విశ్వనాథ ఆలయం నుంచి ఉత్సవ దేవతామూర్తులతో గోదావరిరోడ్డులోని గౌతమేశ్వర ఆలయం వరకు రథోత్సవం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి, పార్వతీపరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను నగర వీధులగుండా ఊరేగించారు. గౌతమేశ్వర ఆలయ ఆవరణలో జంబి వృక్షానికి ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, సురేఖ దంపతులు పూజలు నిర్వహించారు. ప్రజలు పూజల అనంతరం జమ్మి అందజేస్తూ అలాయ్ బలాయ్ తీసుకున్నారు. స్థానిక రాంనగర్‌లో రావణవధ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. నగర మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్, బీఆర్‌ఎస్ నాయకుడు విజిత్‌రావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం
విశ్వనాథ స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులకు మంగళవారం ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు భూమి పూజ చేశారు. రూ.4.94కోట్ల వ్యయంతో ఆలయాన్ని సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
సప్త వ్యసనాల దిష్టిబొమ్మ దహనం
మందమర్రిరూరల్: విజయదశమి పర్వదినాన్ని మందమర్రి పట్టణ ప్రజలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. సింగరేణి ఆధ్వర్యంలో సింగరేణి హైస్కూల్ మైదానంలో సప్త వ్యసనాల దిష్టిబొమ్మ దహనం చేశారు. రాష్ట్ర మంత్రి వివేక్‌వెంకటస్వామి, సరోజ దంపతులు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఏరియా జీఎం రాధాకృష్ణ, శ్రీవాణి దంపతులు, ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య తదితరులు హాజరయ్యారు. అంతకుముందు వేంకకటేశ్వరస్వామి ఆలయం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి విగ్రహ ప్రతిమను పల్లకిలో హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసి కార్యక్రమం వద్దకు మంత్రి, కలెక్టర్, జీఎం, ఏఐటీయూసీ అధ్యక్షుడు తదితరులు మోసుకువచ్చారు. మనిషిలోని సప్త వ్యసనాలను దహించి వేస్తేనే మానవత్వం చేరుతుందనే నమ్మకంతో ప్రతియేడు సింగరేణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సీఐ రమేష్, ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు.


