కుష్ఠువ్యాధి నిర్మూలనే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

కుష్ఠువ్యాధి నిర్మూలనే లక్ష్యం

Oct 22 2026 12:09 AM | Updated on Oct 22 2026 12:09 AM

● నేటి నుంచి నవంబర్‌ 4వరకు ఇంటింటి సర్వే ● గుర్తింపు, చికిత్సపై వైద్య, ఆరోగ్యశాఖ దృష్టి

మంచిర్యాలటౌన్‌: కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. ఈ నెల 22నుంచి నవంబర్‌ 4వరకు వ్యాధిగ్రస్తులను గుర్తించడం, వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడం, ఉచితంగా చికిత్స అందించడమే లక్ష్యంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో 8,10,542మంది జనాభా ఉండగా, 2,12,503 ఇళ్లు ఉన్నాయి. ఇంటింటి సర్వే కోసం 650 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. 2027 వరకు కుష్ఠు రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు గాను జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ సర్వే చేపడుతున్నారు. ప్రతియేటా కుష్ఠువ్యాధి నిర్మూలనకు పలు కార్యక్రమాలు చేపడుతున్నా ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో నిర్మూలన సాధ్యం కావడం లేదు. దీంతో జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రజల్లోకి వెళ్తోంది. కుష్ఠు వ్యాధిపై అవగాహన కోసం పోస్టర్లు, కరపత్రాలు, ఫ్లాష్‌కార్డులను గ్రామాలు, పట్టణాల్లో అతికించి అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేశారు.

బయటకు చెప్పుకోలేకనే..

జిల్లాలో కుష్ఠువ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గించేందుకు ఎన్నో రకాలుగా చర్యలు చేపడుతున్నా ఎక్కడో ఓ చోట వ్యాధికి గురైన వారిని గుర్తిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి నివారణ చర్యలు చేపడుతున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. గతంలో జిల్లా వ్యాప్తంగా జిల్లా వైద్యారోగ్యశాఖ, కుష్ఠువ్యాధి నిర్మూలన సంస్థలు సంయుక్తంగా ఇంటింటి సర్వేలో వ్యాధిగ్రస్తులను గుర్తించి నివారణ మందులు అందజేశారు. వ్యాధిపై సరైన అవగాహన లేక, బయటకు చెబితే సామాజికంగా దూరమవుతామనే భయంతో బాధితులు కాలం వెళ్లదీస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు, సమీపంలో నివసించే వారికి వ్యాధి సోకడానికి కారకులవుతున్నారు. కుష్ఠువ్యాధిపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయించి అవగాహన కల్పిస్తేనే ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశాలు తగ్గుతాయి. అంటువ్యాధి కావడం, ఒకరి నుంచి మరొకరికి సోకేందుకు ఐదు నుంచి ఏడేళ్లు పట్టనుండడంతో ప్రతియేటా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. యండీటీ(బహుళ ఔషధ చికిత్స)తో ఆరు నెలల నుంచి 12 నెలల్లో పూర్తిగా నయం అవుతుంది. కుష్ఠు రోగులు పూర్తి సామాజిక జీవితం గడపవచ్చు. ప్రారంభ దశలో గుర్తించి చికిత్స అందిస్తే అంగవైకల్యానికి దారితీయదు. చికిత్సకు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా మందులు అందజేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement