మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలో పలు కాలనీల్లో బతుకమ్మ ఆడుతున్న చోట విద్యుత్ బల్బులు ఏర్పాటు చేయడంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా ఆయా కాలనీల మహిళలు చీకట్లో బతుకమ్మ ఆడుకోవాల్సి వస్తోంది. కొన్ని చోట్ల వీధుల్లో చీకటి ఉండడంతో ప్రజలు స్వంతంగా డబ్బులు ఖర్చు ఎక్కువ వోల్టేజీ బల్బులు ఏర్పాటు చేసుకుంటున్నారు. నగరంలో వార్డు ఆఫీసర్లు కార్పొరేటర్లతో కలిసి 780 బతుకమ్మ ఆడే ప్రాంతాలను గుర్తించారు. నగరంలో 60 డివిజన్లు ఉండగా, ఒక్కో డివిజన్‌కు బతుకమ్మ పండుగ నేపథ్యంలో 18వోల్ట్స్ బల్బులు 15 చొప్పున అందజేశారు. ఆయా బల్బులు చీకటిగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసినా తక్కువ వోల్ట్స్ బల్బులతో సరిపోయేంత వెలుగులు రాక చీకట్లు కమ్ముకుంటున్నాయి. చీకట్లోనే మహిళలు బతుకమ్మ ఆడుతూ నెట్టుకొస్తున్నారు.
లైట్ల కోసం రూ.20లక్షలు
నగరంలోని 60 డివిజన్లలో ఎంగిలి పూల బతుకమ్మ నుంచి పండుగ పూర్తయ్యే వరకు వీధి దీపాల ఏర్పాటుకు రూ.20లక్షలు కేటాయించారు. టెండరు ప్రక్రియ పూర్తి చేసినా లైట్ల ఏర్పాటులో జాప్యం చేస్తున్నారు. ప్రస్తుతం డివిజన్‌కు 18 వోల్ట్స్ బల్బులు 15 చొప్పున ఇవ్వగా, సద్దుల బతుకమ్మ నాటికి 70 వోల్ట్స్ బల్బుల ఏర్పాటుకు ఏర్పాట్లు చేశారు. 60 డివిజన్లలో ప్రతీరోజు 300కు పైగా ప్రాంతాల్లో బతుకమ్మ ఆడుతున్న మహిళలు సరైన విద్యుత్ దీపాలు లేక చీకట్లోనే ఆడాల్సి వస్తోంది.
70వోల్ట్స్ బల్బులు ఏర్పాటు చేస్తాం
నగరంలోని 60 డివిజన్లలో బతుకమ్మ ఆడుతున్న ప్రాంతాలను గుర్తించాం. రూ.20 లక్షలు లైట్ల ఏర్పాటు కోసం కేటాయించి టెండరు ప్రక్రియ పూర్తి చేశాం. 70 వోల్ట్స్ బల్బులను ప్రతీ డివిజన్‌కు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
– అన్వేష్, మంచిర్యాల నగర కమిషనర్


