రాష్ట్రంలో రైస్ మిల్లింగ్ బంద్‌కు పిలుపు తనిఖీలపై నిరసనగా జిల్లాలోనూ మద్దతు జిల్లాలో ప్రస్తుతం ‘సీఎంఆర్’ ఇస్తున్నవి 28 మిల్లులే.. మిగతావన్నీ బ్లాక్ లిస్టు, డీఫాల్ట్ జాబితాలోనే..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రైస్‌మిల్లర్లు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధం అవుతున్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, పలు జిల్లాల్లో సీఎంఆర్(కస్టం మిల్లింగ్ రైస్) మిల్లింగ్ బంద్ చేశా రు. జిల్లాలో తక్కువ మిల్లులు ఉండడం, మిగతా జిల్లాలతో పోలిస్తే ధాన్యం నిల్వల సమస్య తక్కువగా ఉండడంతో సమ్మెకు వెనకాముందు అవుతున్నా రు. విజిలెన్స్ అధికారుల తనిఖీలు, షార్టేజ్‌పై రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సమ్మెలో పాల్గొంటామని మిల్లర్లు చెబుతున్నారు. రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు ఇక్కడ కూడా బంద్‌లో పాల్గొంటామని అంటున్నారు. జిల్లాలో రా, బాయిల్డ్ రైస్‌మిల్లులు క్రియాశీలకంగా ఉన్నవి 28మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే 22మంది మిల్లర్లపై కేసులు నమోదయ్యాయి. కొందరిపై పీడీ యాక్టు కూడా నమోదైంది. ఆర్‌ఆర్(రెవెన్యూ రికవరీ) యాక్టుతో పాటు క్రిమినల్ కేసులు ఉన్నాయి. కొందరు హైకోర్టులో కేసులు వేయగా, స్టే ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో మిల్లర్ల సమ్మె ప్రభావం జిల్లాలో తక్కువగా ఉండనుంది.
నిల్వలపై గుబులు
ప్రస్తుతం మిల్లర్ల వద్ద రైతుల నుంచి సేకరించిన గత రెండు సీజన్ల వడ్లు ఉన్నాయి. గత ఖరీఫ్, రబీ పంటల ధాన్యం మిల్లుల్లోనే ఉంది. ఖరీఫ్ 49వేల మెట్రిక్ టన్నుల బియ్యం, రబీ 41వేల మెట్రిక్ టన్నుల బియ్యం పౌరసరఫరాల శాఖకు అందించా ల్సి ఉంది. వీటిలో ఖరీఫ్ 70శాతం వరకు, రబీ 25శాతం వరకు ఇంకా బియ్యం అందించాల్సి ఉంది. ప్రతీ మిల్లులో ధాన్యంలో కచ్చితంగా షార్టేజ్(తక్కువ)గా నిల్వలు ఉంటాయని మిల్లర్లే చెబుతున్నారు. కనీసం 15నుంచి 20శాతం అన్ని చోట్ల తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం బకాయిలు ఉన్న మిల్లర్లతోపాటు ధాన్యం నిల్వలపైన కఠినంగా ఉండడంతో పీవీ(ఫిజికల్ వెరిఫికేషన్) చేయాలంటూ ఆదేశాలు వచ్చాయి. గతంలో అదనపు కలెక్టర్, డీసీఎస్‌వో, డీఎం, డీటీ, స్థానిక అధికారులతో పాటు విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా పరిశీలనలు చేసేవారు. ఇప్పుడు ఆకస్మికంగా ఎప్పుడైనా, ఏ అధికారైనా మిల్లుల్లో తనిఖీలు చేయొచ్చు. ఒక అధికారి ఇచ్చిన తనిఖీ నివేదికపై మరో అధికారి మరోసారి తనిఖీలు చేసేలా సూపర్ చెకింగ్ తరహా లో తనిఖీలు చేయనున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ తరహా తనిఖీలు చేయగా, తక్కువ(షార్టేజ్) నిల్వలు ఉన్న మిల్లులకు జరిమానాలు వేస్తున్నారు. దొడ్డు, సన్న రకానికి కార్పొరేషన్ సూచించిన రేటు ప్రకారమే ఆ ధాన్యానికి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పౌరసరఫరాల శాఖ తమను ఒత్తిడి చేయొద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ మిల్లర్లను మరింత ఒత్తిడి తేస్తే సీఎంఆర్ బకాయిలు పెరగడంతోపాటు రేషన్ బియ్యం సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో ఆచితూచీ అడుగు వేస్తున్నట్లు సమాచారం.
మద్దతు ఇస్తాం
తనిఖీల పేరుతో 15నుంచి 20శాతం షార్టేజ్‌ను కూడా లెక్కలోకి తీసుకుని జరిమానాలు వేస్తే మిల్లర్లు తీవ్రంగా నష్టపోతారు. రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్ల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోనూ మిల్లులు బంద్ చేసి మద్దతు ఇస్తాం.
– చిలువేరు వైకుంఠం,
అధ్యక్షుడు, జిల్లా మిల్లర్ల సంఘం
సమ్మెకు కారణాలివే..
సీఎంఆర్ సకాలంలో అందిస్తున్న మిల్లులకు సకాలంలో మిల్లింగ్ చార్జీలు అందడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిల్లులు చెల్లించడం లేదని మిల్లర్లు చెబుతున్నారు. ప్రస్తుతం రెండేళ్ల మిల్లింగ్ చార్జీలు జిల్లాలో రూ.కోట్లలో చెల్లించాల్సి ఉంది. ప్రతీ మిల్లులకు పెద్ద మొత్తంలో ఇవ్వాల్సిన ధాన్యం రవాణా చార్జీలు, డ్రైయేజ్(తేమ ఆరబోత) చార్జీలు చెల్లించాలి. బ్లాక్ లిస్టులో ఉన్న డీఫాల్ట్ మిల్లర్లకు బకాయి బియ్యంపై కార్పొరేషన్ విధించిన 25శాతం జరిమానా, 12శాతం వడ్డీ ఎత్తివేయాలి. టెండర్ వేసిన ధాన్యం విలువకు సైతం జరిమానా, వడ్డీ తొలగించాలి. అవుట్ టర్న్ రాని కారణంగా ప్రతీ క్వింటాల్ ధాన్యానికి పౌరసరఫరాల కార్పొరేషన్‌కు రా రైస్ 67కిలోలు, బాయిల్డ్ రైస్ 68కిలోలు ఇవ్వాలి. ఈ క్రమంలో ధాన్యం నిల్వలకు సరిపడా స్థలం లేక నష్టపోయామని వాదిస్తున్నారు.


