దస్తురాబాద్: ఆర్టీఐ ఆధారంగా అక్రమంగా పింఛన్లు తీసుకుంటున్న వారిపై ఫిర్యాదు చేసిన వ్యక్తిపై దాడిచేసిన ఘటన మండలంలోని పెర్కపల్లెలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన కొట్టే శేఖర్ తన ప్వూర్వీకుల భూమి విషయంలో గ్రామానికే చెందిన కొత్తపల్లె కాలనీకి చెందిన వారితో వివాదం జరుగుతోంది. ఈ క్రమంలో శేఖర్ ప్రజవాణిలో అక్రమ ఫించన్లపై ఫిర్యాదు చేశాడు. అధికారులు అరకొర సమాధానం ఇవ్వడంతో ఆర్టీఐ ద్వారా వివరాలు కోరాడు. ఆ వివరాలతో ప్రజవాణిలో అక్రమంగా ఫించన్లు పొందుతున్నవారిపై ఫిర్యాదు చేశాడు. అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు. దీంతో కోపోద్రిక్తులైన కొత్తపల్లెకు చెందిన కొందరు శేఖర్‌పై దాడి చేశారు. ఎస్సై సాయికుమార్ గ్రామానికి చేరుకుని బాధితుడిని ఖానాపూర్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


