లోకేశ్వరం: స్నేహితుడిని ఎయిర్‌పోర్టులో దింపేందుకు వెళ్లిన ఓ వ్యక్తి.. తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి వద్ద గురువారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామానికి చెందిన పైడిపల్లి భోజన్న(47) నిర్మల్ పట్టణంలోని మంజూరపూర్‌లో నివాసం ఉంటున్నాడు. దిలావర్‌పూర్ మండలంలోని కంజర్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మంజూలపూర్‌కు చెందిన మిత్రుడు రాజేశ్వర్‌ను దుబాయ్ వెళ్లేందుకు గురుపల్లి గంగాధర్, మనోజ్ స్నేహితులతో కలిసి రాజేశ్వర్ దుబాయి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. దీంతో అతడిని ఎయిర్‌పోర్టులో దింపేందుకు రాజేశ్వర్ బంధువులకు చెందిన కారులో భోజన్న, గంగాధర్, మనోజ్ బుధవారం రాత్రి వెళ్లారు. హైదారాబద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దింపిన తర్వాత గురువారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు. 44వ జాతీయ రహదారి నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి వద్దకు ఉదయం 11 గంటల చేరుకున్నారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఆగిఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదం జరగడంతో కారు నుజ్జునుజ్జయింది. ముందు సీట్లో భోజన్న, డ్రైవర్ సీట్లో గంగాధర్, వెనక సీట్‌లో మనోజ్ ఉన్నారు. ఈ సంఘటనలో పైడిపల్లి భోజన్న అక్కడిక్కడే మృతి చెందాడు. గంగాధర్, మనోజ్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నిజామాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరతించారు. భోజన్నకు భార్య సంగీత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.
హెచ్‌ఎం మరణంతో విషాదం
దిలావర్‌పూర్: కంజర్ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం భోజన్న మృతితో పాఠశాలలో విషాదం నెలకొంది. విద్యార్థుల ఉన్నతికి కృషి చేసిన భోజన్న మరణంతో గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. సర్పంచ్ చందు మాట్లాడుతూ భోజన్న మృతి వార్త తమను కలిచివేసిందన్నారు. ఆయన మృతికి పంచాయతీ ఆధ్వర్యంలో సంతాపం తెలిపారు.


