చెన్నూర్‌రూరల్: పత్తి పంటను ఆశించి రసం పీల్చే వాటిలో పిండినల్లి పురుగులు ప్రధానమైనవి. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఈ పురుగులు పత్తి పంటను ఆశిస్తాయి. ఇవి చిన్నవిగా, మెత్తగా, లేత గులాబీరంగులో ఉంటాయి. కొమ్మలు, కాండం, మొగ్గలు, కాయల నుంచి రసాన్ని పీలుస్తాయి. ఫలితంగా మొక్కల్లో సాధారణంగా జరిగే ఆవశ్యక మూలకాలు, పదార్థాల సరఫరాలో అంతరాయం ఏర్పడి గిడసబారి పోతాయి. కణుపుల మధ్య దూరం తగ్గి మొక్క గుబురుగా చిన్నదిగా కనిపిస్తుంది. దీని నివారణకు చర్యలు చేపట్టాలని చెన్నూర్ ఏడీఏ బానోతు ప్రసాద్ సూచించారు.
నివారణచర్యలు
పురుగు ఆశించిన మొక్కలను పీకి కాల్చి వేయాలి. ఇలా చేయడం ద్వారా దాని విస్తరణను అదుపులో ఉంచవచ్చు. పొలం గట్లపైన ఉండే కలుపు మొక్కలు మఖ్యంగా వయ్యారిభామ, తుత్తురబెండ, గడ్డిచామంతి, వంటి కలుపు మొక్కలను పీకి కాల్చి వేయాలి. జైగోగ్రామ బైకోలరేట్ మిత్ర పురుగులను హెక్టారుకు 500 నుంచి 1000 వరకు విడుదల చేయాలి. తద్వారా వయ్యారిభామ, కలుపు మొక్కలను నివారించవచ్చు. దీని ద్వారా పిండినల్లి ఉధృతి తగ్గించవచ్చు. పత్తి ఏరిన తర్వాత ఎండు కర్రలను పీకి కాల్చి వేయాలి. వేసవి దుక్కుల ద్వారా నేలలో దాగి ఉండే పిల్ల పురుగులను నియంత్రించవచ్చు. అంతర పంటగా అలసంద, బబ్బెర, సోయాబీన్, మినుము వంటి పంటలను సాగు చేయడం ద్వారా మిత్ర పురుగుల సంఖ్యను వృద్ధి చేయవచ్చు. కంచె పంటగా లేదా రక్షక పంటగా రెండు వరుసల సజ్జ లేదా కందులను దట్టంగా పెంచాలి. దీని ద్వారా ప్రధాన పంట అయిన పత్తిలో పిండినల్లి ఉధృతి తగ్గించుకోవచ్చు. మొక్కలను పురుగు ఆశిస్తే లీటరు నీటిలో 10 మిల్లీలీటర్ల వేపనూనెతో పాటు ఒక గ్రాము సబ్బు పొడిని కలిపి 10 నుంచి 12 రోజుల తేడాతో మొక్కలపై పిచికారీ చేయాలి. దీంతో చీడ, పీడలు తగ్గుతాయి, తద్వారా మంచి దిగుబడులు పొందవచ్చు.
ఏవిధంగా ఆశిస్తుంది
పిండినల్లి పురుగులు ముఖ్యంగా పొలంగట్లపై, పనికి రాని భూముల్లో పెరిగే కలుపు మొక్కల ద్వారా వ్యాపిస్తాయి. బెండ, టమాటా, వంగ, క్యాబేజీ, బొప్పాయి, నిమ్మ, జామ, మందార, గోగు, చామంతి, గడ్డి చామంతి, రామబాణం, వయ్యారిభామ, తుత్తర బెండ, సీతాఫలం, సుబాబుల్, గ్‌లైరిసిడియా వంటివి పిండినల్లికి అతిథి మొక్కలు. పురుగుపై తెల్లని మైనపు పొర ఉండటం చేత, అది పురుగు మందుల ప్రభావం నుంచి ఇతర సహజ మరణం నుంచి రక్షణ పొందుతుంది. ఈ పురుగు సాధారణంగా సంవత్సర కాలంలో 15 తరాలకు అభివృద్ధి చెందగలదు. అలాగే ఆడ పురుగు పెట్టే ఒక గుడ్ల సంచిలో దాదాపు 600 వరకు గుడ్లు ఉంటాయి. పంట పొలంలో సహజంగా పెరిగే మిత్ర పురుగులు అంతరించి పోవడం వలన పురుగు విసర్జించే తేనె వంటి ద్రవం కొరకు వచ్చే చీమల ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు పిండినల్లి వ్యాపిస్తుంది. అంతే కాకుండా పురుగు సహజంగా పంట ఉత్పత్తుల ద్వారా, పత్తి కర్రల ద్వారా గాలి, నీటి కాలువలు, వర్షం, పక్షులు, పశువుల ద్వారా వ్యాపిస్తుంది. మనుషులు ఈ పురుగులు ఆశించిన ప్రాంతం నుంచి ఆశించని ప్రాంతానికి తిరగడం ద్వారా కూడా వ్యాపిస్తుంది.


