‘క్రిటికల్‌ కేర్‌’ ఆలస్యం | - | Sakshi
Sakshi News home page

‘క్రిటికల్‌ కేర్‌’ ఆలస్యం

Sep 4 2026 7:47 AM | Updated on Sep 4 2026 7:47 AM

● జీజీహెచ్‌ భవనంలోనే సేవలు ● అత్యవసర వైద్యానికి అగచాట్లు ● వసతులు లేక క్షతగాత్రుల పాట్లు ● నూతన భవనం పూర్తయ్యేదెప్పుడో!

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి క్రిటికల్‌ కేర్‌ మంజూరు చేసినా అత్యవసర వైద్యం పూర్తి స్థాయిలో అందడంలేదు. శిథిలావస్థకు చేరిన ఆస్పత్రి భవనంలో సాధారణ సేవలు అందించడమే కష్టమైన తరుణంలో క్రిటికల్‌ కేర్‌ విభా గం వైద్యం అంతంత మాత్రంగానే అందుతోంది. దీంతో మేజర్‌ యాక్సిడెంట్‌ కేసులు వచ్చినా వెంటనే రెఫర్‌ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. క్రిటికల్‌ కేర్‌ విభాగానికి ప్రత్యేక ఐసీయూలతో పాటు వైద్యులు, సిబ్బంది, రోగులకు ఎమర్జెన్సీగా ఇచ్చే మందులు, స్కానింగ్‌లు, శస్త్ర చికిత్సలు.. ఇలా అన్నీ ఒకేచోట అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం జీజీహెచ్‌లో ఆర్థోపెడిక్‌, మత్తు వైద్యులు అందుబాటులో ఉండగా, న్యూరో సర్జన్‌ లేడు. ఆస్పత్రికి కేటాయించిన 50 పడకల ఐసీయూనే క్రిటికల్‌ కేర్‌ విభాగానికి వినియోగిస్తున్నారు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు, క్రిటికల్‌ కేర్‌ ద్వారా చికిత్స పొందే వారికి ఐసీ యూ బెడ్లు సరిపడా లేక ఇబ్బందులేర్పడుతున్నా యి. ఇప్పటికే కాలేజీరోడ్డులో రూ.129.25 కోట్లతో నూతన జనరల్‌ ఆస్పత్రి భవనాన్ని నిర్మిస్తుండగా, దాని పక్కనే రూ.23.75 కోట్లతో క్రిటికల్‌ కేర్‌ విభాగం కోసం నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. జీజీహెచ్‌ భవనం దాదాపు పూర్తికాగా, క్రిటికల్‌ కేర్‌ విభాగం భవనం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఇది పూర్తయి వినియోగంలోకి వచ్చేందుకు దాదాపు మరో ఏడాది పట్టనుంది.

గోల్డెన్‌ అవర్‌లో చికిత్స అందితేనే..

జిల్లా కేంద్రంలోని కాలేజీరోడ్డులో నూతనంగా చేపట్టిన క్రిటికల్‌ కేర్‌ విభాగం భవనాన్ని 50 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, హార్ట్‌ ఎటాక్స్‌, గర్భిణుల అత్యవసర సమస్యలు లాంటి సందర్భాల్లో మొదటిగంట గోల్డెన్‌ అవర్‌. ఇది అత్యవసర వైద్యానికి ఎంతో కీలకమైన సమయం కావడంతో క్రిటికల్‌ కేర్‌ విభాగం పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించడం ద్వారా రోగుల ప్రాణాలు కాపాడే అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుత జీజీహెచ్‌లో పూర్తిస్థాయి వసతులు లేక అత్యవసర వైద్యం అవసరమైన రోగులను కరీంనగర్‌, హైదరాబాద్‌ లాంటి ప్రాంతాలకు రెఫర్‌ చేస్తున్నారు. కాలేజీరోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న జీజీహెచ్‌, క్రిటికర్‌ కేర్‌ విభాగాలు అందుబాటులోకి వస్తే మంచిర్యాల జిల్లాతో పాటు కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా, మహారాష్ట్రకు చెందిన ప్రజలకూ అత్యుత్తమ సేవలందే అవకాశముంది.

ఆధునిక సదుపాయాలతో..

మంచిర్యాలలో నిర్మిస్తున్న 50 పడకల ఐసీయూ క్రిటికల్‌ కేర్‌ విభాగం భవనంలో అత్యంత ఆధునిక సదుపాయాలు కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో 10 ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు (ఐసీయూ), ఆరు హైడిపెండెన్సీ యూనిట్లు (హెచ్‌డీయూలు), 24 ఐసోలేషన్‌ పడకలు, నాలుగు ఎమర్జెన్సీ బెడ్లు, రెండు ఐసోలేషన్‌ గదులు, రెండు మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్లు, రెండు లేబర్‌ డెలివరీ రికవరీ (ఎల్‌డీఆర్‌) గదులుంటాయి. వీటితో పాటు రెండు డయాలసిస్‌ బెడ్లు, ఒక డెడికేటెడ్‌ ల్యాబ్‌, స్వతంత్ర ఆక్సిజన్‌ సరఫరా వ్యవస్థ తదితర సదుపాయాలు కల్పించనున్నారు. వీటితో పాటు నిపుణులైన వైద్యులు, నర్సింగ్‌ స్టాఫ్‌, టెక్నీషియన్లు అందుబాటులో ఉండి సేవలందించడం ద్వారా క్రిటికల్‌ కేర్‌ విభాగానికి చికిత్స కోసం వచ్చే రోగులకు ప్రాణాపాయం తప్పే అవకాశాలుంటాయి. ఈ విభాగానికి ఆర్థోపెడిక్‌, న్యూరో, ప్లాస్టిక్‌ సర్జన్లు, జనరల్‌ సర్జన్‌, జనరల్‌ ఫిజీషియన్‌, కార్డియాలజిస్ట్‌, మత్తుమందు వైద్యుడు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం జీజీహెచ్‌లో కొనసాగుతున్న క్రిటికల్‌ కేర్‌లో ఆర్థోపెడిక్‌, జనరల్‌ ఫిజీషియన్‌, మత్తుమందు వైద్యుడు అందుబాటులో ఉన్నారు. న్యూరో సర్జన్‌, కార్డియాలజిస్ట్‌ లేరు. కనీసం నూతన క్రిటికల్‌ కేర్‌ అందుబాటులోకి వచ్చేలోపు పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమిస్తేనే రోగులకు పూర్తిస్థాయి చికిత్స అందించే అవకాశముంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement