టీచర్ల సర్దుబాటులో గందరగోళం | - | Sakshi
Sakshi News home page

టీచర్ల సర్దుబాటులో గందరగోళం

Aug 20 2026 3:46 AM | Updated on Aug 20 2026 3:46 AM

● ఒక్కరికే రెండు పాఠశాలల్లో విధులు ● విద్యార్థులున్నాచోట నియామకమేది..? ● నాలుగు మండలాలు దాటి డిప్యూటేషన్లు

మంచిర్యాలఅర్బన్‌: జిల్లా వ్యాప్తంగా ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల వర్క్‌అడ్జస్ట్‌మెంట్లు గందరగోళంగా మారాయి. ఎంఈవోల నివేదికల ఆధారంగా సర్దుబాట్లు చేపట్టగా క్షేత్రస్థాయిలో చోటు చేసుకున్న పొరపాట్లు ఉపాధ్యాయులను మనోవేదనకు గురి చేస్తున్నాయి. కొందరు ఎంఈవోల బాధ్యతారాహిత్యం, ప్రణాళిక లోపం వల్ల తాత్కాలిక బదిలీలు అభాసుపాలవుతున్నాయి. ఒకే టీచర్‌కు మూడు రోజుల చొప్పున రెండు పాఠశాలల్లో విధులు కేటాయించడం నివ్వెరపరుస్తోంది. అవసరం లేకున్నా పాఠశాలల్లో ఉన్న టీచర్లను కదపకుండా.. అవసరం ఉన్న చోట ఉపాధ్యాయులను కేటాయించకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ ప్రాంత పాఠశాలల కంటే గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధ్యాయులను ఇతర బడులకు డిప్యూటేషన్‌ చేయడం మిగులు ఉపాధ్యాయుల గుర్తింపులో లోపాలను ఎత్తిచూపుతోంది.

నిబంధనలకు విరుద్ధంగా..

పక్క పక్క మండలాలకు కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని టీచర్లను నిబంధనలకు విరుద్ధంగా పట్టణ, సెమీ అర్బన్‌ ప్రాంతాలకు డిప్యూటేషన్‌ చేయడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనో.. ఏమోగానీ మిగులు టీచర్‌గా ఇతర మండలాలకు పంపిస్తున్నారు. చెన్నూర్‌, వేమనపల్లి, భీమారం, కోటపల్లి మండలాల నుంచి ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్నారు. మారుమూల గ్రామాల్లో ప్రైవేటు పాఠశాలల పోటీ లేకున్నా అక్కడ సంఖ్య పెరగకపోవడానికి అధికారుల పర్యవేక్షణ లోపమా.. ఉపాధ్యాయులా అనేది తేలాల్సి ఉంది. రెండేళ్లుగా టీచర్ల సర్దుబాటు ఏమోగానీ విద్యార్థుల సంఖ్య పెరగడం లేదని తెలుస్తోంది. ఉదాహరణకు కోటపల్లి మండలం జనగామ ఎంపీయూపీఎస్‌లో 6, 7వ తరగతుల్లో విద్యార్థుల సంఖ్య పడిపోయింది. ఇక్కడ ఓ టీచర్‌ దొనబండకి, ఇంకొకరు ప్యానల్‌ కమిటీ సభ్యులుగా వెళ్లారు. విద్యార్థులు కొందరు హాస్టల్‌, గురుకులాలకు వెళ్లిపోయారు. మిగిలిన కొందరు దూరప్రాంతంలోని సిర్సా పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ ఉపాధ్యాయులు చొరవ చూపితే విద్యార్థుల సంఖ్య పెరిగేది. పట్టణ ప్రాంతాల్లో పెరిగే అడ్మిషన్లను చూడడం తప్ప గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల ప్రవేశాలపై అంతగా శ్రద్ధ చూపకపోవడం, విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో టీచర్లకు సర్దుబాటుకు అవకాశంగా మారిందనే అభిప్రాయాలున్నాయి.

ఒక్కరికే రెండు బడులు

ఒకే ఉపాధ్యాయునికి రెండు పాఠశాలలు కేటాయించిన విచిత్ర డిప్యూటేషన్‌ ఇది. ప్రతీ సబ్జెక్టుకు టీచర్‌ రెగ్యులర్‌గా వస్తేనే పాఠాలు పూర్తి కాని పరిస్థితి. అలాంటిది వారానికి రెండు బడులు కేటాయించారు. నెన్నెల మండలం ఆవడం పాఠశాల స్కూల్‌ అసిస్టెంట్‌(బయోలాజి) ఉపాధ్యాయుడు నారాయణను ఎంపీయూపీఎస్‌ నార్వాయిపేట్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ తాండూర్‌కు మూడు రోజుల చొప్పున సర్దుబాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కొందరిని దూర ప్రాంతాల్లోని పాఠశాలలకు సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement