మంచిర్యాలటౌన్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు టిఫిన్, మధ్యాహ్న భోజనం రుచికరంగా, పూర్తి నాణ్యతతో అందించాలని జిల్లా అదనపు కలెక్టర్, ఇంచార్జి డీఈవో పి.చంద్రయ్య అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కాలేజీరోడ్డులో సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులను మంచిర్యాల నగర కమిషనర్ అన్వేష్, అసిస్టెంట్ కమిషనర్ రాజుతో కలిసి పరిశీలించారు. హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్, అక్షయపాత్ర ఫౌండేషన్, మన్నా ట్రస్ట్ ప్రతినిధులతో మాట్లాడారు. విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో నిర్మించిన బీఈఆర్‌ఏ గదిని ఆర్‌ఎంవో శ్రీధర్‌తో కలిసి పరిశీలించారు. ఆసుపత్రి పనులను జాప్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు.
సీపీఎస్‌ను రద్దు చేయాలి
జైపూర్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని(సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల రాజేందర్ డిమాండ్ చేశారు. ఆగస్టు 23న హైదరాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని జైపూర్ మండల కేంద్రంలో బుధవారం ‘చలో హైదరాబాద్’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో బి.శ్రీనివాస్, కాంప్లెక్స్ హెచ్‌ఎం పి.శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


