మంచిర్యాలటౌన్: పర్యావరణానికి, ప్రజలకు, ఇతర ప్రాణుల ఆరోగ్యానికి నష్టదాయకమనే కారణంతో పాలిథిన్‌తో తయారయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం నిషేధించాలన్న జాతీయ కాలుష్య నియంత్రణ మండలి సూచనను అన్ని మున్సిపాలిటీల్లో అమల్లోకి తెచ్చినా, పూర్తిస్థాయిలో అరికట్టలేక పోతున్నారు. పాలిథిన్ సంచులు, నీటిసీసాలు, ఆహారం ప్యాక్ చేసే కవర్లు, ప్లాస్టిక్ విస్తర్లు తదితర వస్తువులు క్షేమదాయకం కాదని తెలిసినా.. పరిస్థితుల కారణంగా ప్రజలు వినియోగిస్తున్నారు. ప్రధానంగా ప్రత్యామ్నయం లేకపోవడంతో పాటు, ప్రజా చైతన్య కార్యక్రమాలను చేపట్టక పోవడంతోనే ఆశించిన ఫలితాలు అంతగా కనిపించడం లేదు. గతంలో ప్లాస్టిక్ వినియోగంపై మున్సిపాలిటీల్లో అధికారులు తనిఖీలు చేపట్టడం, జరిమానా విధించడంతో కొంత వరకు ప్లాస్టిక్ వినియోగం తగ్గింది. కొంత కాలంగా ప్లాస్టిక్ నిషేధంపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విక్రయాలు మాత్రం యథేచ్చగా సాగిపోతున్నాయి. వీటి వినియోగం ఎక్కువ కావడంతో మంచిర్యాల కార్పొరేషన్‌తో పాటు, బెల్లంపల్లి, మందమర్రి, చెన్నూరు, క్యాతన్‌పల్లి, లక్సెట్టిపేట్ మున్సిపాలిటీల్లోని వీధుల్లో వేస్తున్న చెత్తకుప్పల్లో ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లే దర్శనమిస్తున్నాయి. పశువులు ప్లాస్టిక్ కవర్లను తిని మృత్యువాత పడుతున్నాయి. పర్యావరణ కాలుష్యానికి ప్లాస్టిక్ కవర్లు కారణమవుతున్నాయి. కనీస తనిఖీలు చేపట్టక పోవడం, జరిమానా విధించక పోవడం, వ్యాపారుల్లో మార్పు తీసుకువచ్చే ప్రయత్నాలు చేయకపోవడం, ప్రత్యామ్నాయం చూపకపోవడంతో జిల్లాలో ప్లాస్టిక్ వినియోగం యథేచ్చగా సాగుతోంది.
తనిఖీలు, జరిమానాలతోనే ..
కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న పాలిథిన్‌ను పూర్తిగా నిషేధించారు. ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ (1986) ప్రకారం సీడీఎంఏ హైదరాబాద్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సామగ్రి జప్తు, రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా, లైసెన్సు రద్దుతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. వ్యాపారులు, ప్రజల్లోనూ మార్పు వచ్చేందుకు తగిన చర్యలు చేపట్టాలి. చేతి సంచితోనే కూరగాయల మార్కెట్‌కు రావాలని, ఎవరూ ప్లాస్టిక్‌ను వినియోగించినా మున్సిపల్ చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించాలి. ఎప్పుడో ఒకసారి ప్లాస్టిక్ నిషేధంపై తనిఖీలు చేపట్టి వదిలేస్తున్నారు. ఇటీవల మంచిర్యాల కార్పొరేషన్‌లోనూ ప్లాస్టిక్‌ను విక్రయిస్తున్న పలు దుకాణాలను తనిఖీ చేసి జరిమానా విధించారు. ఆ తర్వాత తనిఖీలు చేపట్టకుండా వదిలేయడంతో మళ్లీ ప్లాస్టిక్ కవర్ల విక్రయాలు ఊపందుకున్నాయి.
చెత్త కుప్పల్లో ప్లాస్టిక్
మున్సిపాలిటీల్లోని పలు కాలనీల్లో వేసే చెత్త కుప్పల్లో సగం ప్లాస్టిక్ కవర్లే కనిపిస్తున్నాయి. ప్రతీరోజు దాదాపు 150 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడితే అందులో నాలుగోవంతు ప్లాస్టిక్ కవర్లే ఉంటున్నాయి. ఇళ్లల్లో నుంచి వెలువడే చెత్తలో తడి, పొడి చెత్త వేర్వేరుగా ప్లాస్టిక్ కవర్లలోనే వేసి మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు అందిస్తున్నారు. దుకాణాల నుంచి బ యటపడేసే చెత్తలోనూ ప్లాస్టిక్ కవర్లు పెద్ద ఎత్తున వెలువడుతున్నాయి. వాటిని బయట పడేయడంతో చెత్తతో పాటే ప్లాస్టిక్ కూడా కలుస్తుంది. జిల్లాలో దా దాపు 95 వేలకు పైగా ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారని అంచనా. పశువులు రోడ్డు పక్కన ఉండే చెత్త, అందులోని ప్లాస్టిక్ కవర్లను తినడంతో జీర్ణం చేసుకోలేక అనారోగ్యం బారిన పడుతున్నాయి.
జిల్లాలోని మున్సిపాలిటీల్లో సేకరిస్తున్న
చెత్తలో మూడోవంతు ప్లాస్టిక్‌దే
మున్సిపాలిటీ సేకరించే
చెత్త (మె.ట)
మంచిర్యాల కార్పొరేషన్ 60
మందమర్రి 18
బెల్లంపల్లి 20
క్యాతన్‌పల్లి 15
చెన్నూర్ 18
లక్సెట్టిపేట 17


