వరద రాక.. నీరు చేరక బోసిపోయిన ఎస్సారెస్పీ ఐదేళ్ల కనిష్ట స్థాయికి చేరిన నీటి నిల్వలు బాబ్లీ గేట్లు తెరిచినా కనిపించని జలకళ
భైంసా: ఉత్తర తెలంగాణకు జీవనాడిగా, రైతాంగానికి వరప్రదాయినిగా పేరొందిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల దాటినా ప్రాజెక్టులోకి ఆశించిన స్థాయిలో వరద ప్ర వాహం చేరకపోవడంతో నీటి నిల్వలు గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి చేరాయి. మహా రాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను జూలై ప్రారంభం నుంచి ఎత్తి ఉంచినప్పటికీ, ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు లేకపోవడంతో గోదావరిలో వరద ఉధృతి పెరగలేదు. ఫలితంగా ఎస్సారెస్పీకి ఆశించిన మేర నీటి చేరిక లేక రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఐదేళ్లలోనే అత్యల్ప నిల్వలు..
ఈ ఏడాది నమోదైన నీటి నిల్వలు గత ఐదేళ్లతో పోలిస్తే అత్యల్పంగా ఉన్నాయి. గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి 2,083 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. అవుట్‌ఫ్లో 751 క్యూసెక్కులు కొనసాగుతోంది. ఇందులో విద్యుత్ ఉత్పత్తికి 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీరు వినియోగిస్తున్నారు. ఇటీవలి రోజులతో పో లిస్తే ఇన్‌ఫ్లో పెరిగినా, నిల్వలను గణనీయంగా పెంచేంత స్థాయిలో వరదలు మాత్రం ఇంకా రావడం లేదు.
18 లక్షల ఎకరాల ఆయకట్టు..
ఎస్సారెస్పీ కింద సుమారు 18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఉ మ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని లక్షలాది ఎకరాల వ్యవసాయం ఈ ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉంది. పంటల సాగుకు మాత్రమే కాకుండా ఉత్తర తెలంగాణ వ్య వసాయ ఆర్థిక వ్యవస్థకు కూడా ఈ ప్రాజెక్టు కీలకంగా నిలుస్తోంది. నీటి నిల్వలు ఇలాగే కొనసాగితే ఖరీఫ్ సాగు నిర్వహణపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మిషన్ భగీరథకు కీలకమే..
ఎస్సారెస్పీ కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని అనేక గ్రామాలు, పట్టణాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు కూడా ఈ ప్రాజెక్టు నుంచే సరఫరా అవుతోంది. దీంతో నిల్వలు తగ్గడం వ్యవసాయంతో పాటు తాగునీటి నిర్వహణపైనా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
మహారాష్ట్ర ఎగువ క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసి గోదావరిలో భారీ వరదలు వస్తేనే ఎస్సారెస్పీకి మళ్లీ జలకళ వచ్చే పరిస్థితి ఉంది. ఉత్తర తెలంగాణ రైతుల చూపంతా ఇప్పుడు గోదావరి వరదలపైనే నిలిచింది. భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టు నిండితేనే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌పై నెలకొన్న అనిశ్చితి తొలగే అవకాశం ఉందని రైతులు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ వివరాలు
(సోమవారం ఉదయం 6 గంటల నాటికి)..
పూర్తి స్థాయి నీటిమట్టం:
1091 అడుగులు
ప్రస్తుతం: 1064.40 అడుగులు
నీటి నిల్వ సామర్థ్యం: 80.50 టీఎంసీలు
ప్రస్తుతం: 15.274 టీఎంసీలు
గత కొన్నేళ్లుగా నీటి నిల్వ (టీఎంసీలలో)..
2022 64.677
2023 42.452
2024 22.436
2025 21.029
జూన్ 1
నుంచి జూలై 20 వరకు ఎస్సారెస్పీలోకి మొత్తం 2.574 టీఎంసీల నీరు మాత్రమే కొత్తగా చేరింది. కాగా మిషన్ భగీరథ, విద్యుత్ ఉత్పత్తి, తదితర అవసరాల కోసం 3.644 టీఎంసీల నీటిని విడుదల చేశారు. చేరిన నీటి కంటే విడుదలైన నీరే ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్టు నిల్వలు రోజురోజుకూ తగ్గుముఖం పట్టాయి. ప్రాజెక్టులో ప్రస్తుతం ఐదో వంతు నీరు కూడా నిల్వ లేకపోవడం పరిస్థితి తీవ్రతను
తెలియజేస్తోంది.


