పోలింగ్ చిట్టీల పంపిణీలో నిర్లక్ష్యం
ఇంటింటికీ పంచని బీఎల్‌వోలు, అధికారులు
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల ఇబ్బందులు
బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఫొటోలతో పంపిణీ
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలో బుధవారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు పోల్ చిట్టీల పంపిణీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బీఎల్‌వో(బూత్ లెవల్ అధికారులు)లు ఏ ఎన్నికల్లో అయినా ఇంటింటికి వెళ్లి అందజేస్తుంటారు. ఈ ఎన్నికల్లో అధికారులు పంపిణీ చేయలేదు. దీంతో 60 డివిజన్లలోని 265 పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. పోలింగ్ కేంద్రం ఎక్కడు ఉందో తెలుసుకునేందుకు మున్సిపల్ సిబ్బందికి ఓటరు కార్డు చూపించి చిట్టీలు పొందారు. ఓటేసేందుకు ఇబ్బంది లేకున్నా పోల్ చిట్టీలు పొందడానికి ఓటర్లు వేచి చూడాల్సి వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు పలువురు తమ ఫొటో, గుర్తు, పేరుతో కూడిన పోల్ చిట్టీలను ఓటర్లకు అందజేశారు. తమకే ఓటు వేయాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లో సైతం అభ్యర్థుల ఫొటోలతో కూడిన పోల్ చిట్టీలను తీసుకుని వెళ్లగా అధికారులు వాటిని తీసుకుని ఓటు వేయించారు.
పాతమంచిర్యాల: ఓటరు స్లిప్‌లు పంపిణీ చేయకపోవడంతో ఓటు వేసేందుకు ఇబ్బంది పడ్డామని 42వ డివిజన్ ఎన్టీఆర్ నగర్‌కు చెందిన సుంకి పద్మావతి వాపోయారు. గతంలో బీఎల్‌వోలు ఓటరు స్లిప్‌లు పంపిణీ చేసేవారని, మున్సిపల్ సిబ్బంది చాలా డివిజన్లలో ఓటరు స్లిప్‌లు ఇవ్వలేదని తెలిపారు.


