ప్రజాపాలనలో పారదర్శకంగా ఎన్నికలు
మంచిర్యాలటౌన్: ప్రజాపాలన ప్రభుత్వంలో ఎన్నికలు పూర్తి పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించామని, కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా బుధవారం మంచిర్యాలలోని 52వ డివిజన్ హైటెక్‌సిటీ కాలనీలో నివాసం ఉంటున్న మంత్రి కిలోమీటరు దూరంలోని 227వ పోలింగ్ కేంద్రానికి నడుచుకుంటూ వెళ్లి ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత ప్రజాపాలనలో ఎక్కడా పోలీసు ఒత్తిడి లేదని, గత ప్రభుత్వంలోనే పోలీసులను ఉపయోగించి ఇష్టారాజ్యంగా ఎన్నికలు నిర్వహించారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 85శాతం కంటే ఎక్కువ స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని తెలిపారు.


