సరస్వతి.. రైతుల పెన్నిధి
లక్ష్మణచాంద: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ జలాశయం. నిర్మల్ జిల్లా అన్నదాతల జీవనాధారం సరస్వతి కాలువ. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు ఉన్న కాకతీయ, లక్ష్మీ కాలువల తర్వాత మూడో ప్రధాన కెనాల్ ఇది. 1974–75 నుంచి జిల్లాలోని సాగుభూములను సస్యశ్యామలం చేస్తోంది. ప్రవాహాన్ని నిర్వహిస్తూ ఏడు మండలాల్లోని రైతులకు ఆధారంగా నిలిచింది. 1953లో ఎస్సారెస్పీ నిర్మాణం మొదలు పెట్టారు. 1963లో నిర్మాణం పూర్తయింది. అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ దీనిని జాతికి అంకితం చేశారు. సోన్ మండలం గాంధీనగర్, పాక్‌పట్ల గ్రామాల శివారుల నుంచి ప్రారంభమైన సరస్వతి కాలువ ఏడు మండలాలు, 64 గ్రామాల్లో 33,622 ఎకరాలకు సాగు నీరు అందిస్తోంది.
28 ఉపకాలువల నెట్‌వర్క్
నిర్మల్ రూరల్, సోన్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, పెంబి, కడెం మండలాల్లో 47 కిలోమీటర్ల పొడవున సరస్వతి కాలువ విస్తరించి ఉంది. దీనికి 28 డిస్ట్రిబ్యూషన్ ఉపకాలువలు ఉన్నాయి. వానాకాలం, యాసంగి పంటలకు సాగునీరు అందిస్తూ రైతుల అండగా నిలుస్తోంది. అర్ధ శతాబ్దంగా నిర్విరామంగా పనిచేస్తూ, రైతుల ఆర్థిక భద్రతకు తోడ్పాటు అందిస్తోంది. ఇది కేవలం పొలాలకు మాత్రమే కాక, 64 గొలుసుకట్టు చెరువులను కూడా నింపుతూ కింది ఆయకట్టులకు మద్దతు ఇస్తోంది.
నీటి ప్రవాహం మార్పు వ్యూహం
లక్ష్మణచాందలోని వడ్యాల్ వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి నీటిని కనకాపూర్ వాగుకు మళ్లించి, మునిపెల్లి వద్ద గోదావరి నదిలో కలిపి, సదార్‌మాట్ వరకు విస్తరించాలనే ప్రణాళిక జోరుగా సాగుతోంది. ఈ చర్యలతో కాలువ సామర్థ్యం పెరిగి, మరింత ఆయకట్టు సాగుకు దోహదపడుతుంది. సరస్వతి కాలువ ఆధునీకరణ జరిగితే, నిర్మల్ జిల్లా సాగు ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని నిపుణుల అంచనా.
ప్రవహించే మండలాలు : 7
కాలువ ప్రవహిస్తున్న దూరం : 47 కి.మీ
కాలువకు ఉన్న ఉప కాలువలు : 28
సాగునీరు అందుతున్న
గ్రామాలు : 64
మొత్తం ఆయకట్టు : 33,622 ఎకరాలు
ఆధునీకరణకు ప్రణాళికలు..
ఇక సరస్వతి కాలువలో లైనింగ్ లోపాలు, మట్టి పేరుకుపోవడం, పిచ్చిమొక్కలు పెరగంతో నీరు చివరి వరకు చేరడం లేదు. దీంతో నీటిపారుదల శాఖ రూ.70 కోట్లతో మరమ్మతులకు ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వ ఆమోదం జరిగిన వెంటనే మార్చి నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. లైనింగ్ పోయిన ప్రదేశాల్లో కొత్త లేయర్లు వేయడం.. మట్టి, చెత్త తొలగింపు, గండ్లు, డ్యామేజ్‌ల మరమ్మతు, చెట్ల కత్తిరింపు, ఇరువైపులా రోడ్లు ఏర్పాటు, 28 ఉప కాలువలకు అవసరమైన మరమ్మతులు చేపట్టనున్నారు.
సరస్వతి కాలువ వివరాలు..
50 ఏళ్లుగా సాగునీరు..
పోచంపాడు ప్రాజెక్టు నుంచి మా లక్ష్మణచాంద మండలానికి వస్తున్న సరస్వతి కాలువ 50 ఏళ్లుగా మా మండల రైతులకు సాగు నీటిని అందిస్తోంది. ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చూస్తోంది.
– నాగుల నారాయణ, రైతు, పొట్టపెల్లి
ఆధారం కాలువే
సోన్ మండల ప్రజల పంటల సాగుకు జీవనాధారం సరస్వతి కాలువ. దీంతోనే అన్ని పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాం. ఏటా రెండు పంటలు ఈ కాలువ ఆధారంగానే సాగవుతున్నాయి.
– సాయన్న, రైతు న్యూవెల్మల్
సరస్వతి.. రైతుల పెన్నిధి
సరస్వతి.. రైతుల పెన్నిధి
సరస్వతి.. రైతుల పెన్నిధి


