ఆర్జీయూకేటీలో ఐఐఈడీ సెల్
బాసర: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, వారిని భావి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో బాసర ఆర్జీయూకేటీలో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ (ఐఐఈడీ) సెల్‌ను గురువారం గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్, ఓఎస్‌డీ డాక్టర్ మురళీదర్శన్ పర్యవేక్షణలో ఈ కేంద్రాన్ని అత్యున్నత ప్రమాణాలతో రూపొందించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ విద్యార్థి కేవలం చదువులకే పరిమితం కాకుండా తమ వినూత్న ఆలోచనలకు ప్రాణం పోసి నమూనాలను తయారు చేసుకునేందుకు ఈ సెల్ ఒక అద్భుతమైన వేదికగా నిలవనుందన్నారు. ఈ ఇంక్యుబేషన్ సెల్ మరింత విస్తరించాలని, దీని ఫలాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలన్నారు. వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ మాట్లాడుతూ ‘స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా రైజింగ్ తెలంగాణ 2047’ స్ఫూర్తితో సెల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓఎస్‌డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ మాట్లాడుతూ ఇలాంటి వ్యవస్థాపనల వల్ల విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ టీ.రాకేష్‌రెడ్డి, డీన్లు డాక్టర్ ఎస్.విఠల్, డాక్టర్ కె.మహేశ్, ఎస్.శేఖర్, జి.నాగరాజు, డాక్టర్ అన్పత్ రాహుల్, డాక్టర్ దిల్ బహార్, డాక్టర్ జి దేవరాజు, డాక్టర్ కె.మధుసూదన్, డాక్టర్ భావ్‌సింగ్, ఎస్.రాజేశ్వర్, అరుణజ్యోతి, సిస్టమ్స్ అండ్ నెట్‌వర్కింగ్ అడ్మినిస్ట్రేటర్ వి.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


