మార్కెట్ ‘బంగారు’మయం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఈ ఏడాది జిల్లాలో జనవరి 28 నుంచి 31 వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు ముందస్తుగా ఇళ్లల్లో వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. తాము కోరిన కోర్కెలు నెరవేరితే తల్లులకు అత్యంత ఇష్టమైన బంగారం(బెల్లం) నిలువెత్తు సమర్పించుకుంటారు. ఈ క్రమంలోనే మార్కెట్‌లో గత ఆదివారం నుంచి బంగారం (బెల్లం) కొనుగో ళ్లు ఊపందుకున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచే కా కుండా మహారాష్ట్రలోని లాథూర్, నాందేడ్, నాగ్‌పూర్‌ల నుంచి బెల్లం సరఫరా జరుగుతోంది. కిలోకు రూ.40 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు. రోజుకు 50 నుంచి 80 టన్నుల వరకు అమ్మకాలు జరుగుతున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. జాతర సీజన్ మొత్తంగా 60 నుంచి 100 లారీల వరకు అంటే 2 వేల టన్నులకు పైగా వ్యాపా రం జరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు.


