కేంద్ర ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్తా
ఉట్నూర్‌రూరల్: జిల్లాలోని పలు కొలాం గ్రామాల్లో ఇంటి నిర్మాణాలు చేపట్టకుండా అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లేందుకు త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నట్లు ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సొనేరావ్ తెలిపారు. గురువారం ఉట్నూర్ మండలంలోని కొలాంగూడలో 16 కోర్ ఏరియా గ్రామాల పటేళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లు మంజూరయ్యాయని కొలాం తెగకు చెందిన లబ్ధిదారులు ఉన్న గుడిసెలను తొలగించుకుని నిర్మాణాలు చేపట్టగా అటవీ శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు. కలెక్టర్‌తో పాటు ఐటీడీఏ పీవో, అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన జిల్లా ఇన్‌చార్జీ మంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సైతం తమ సమస్యను వివరించామన్నారు. సమావేశంలో పీవీటీజీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు టేకం వసంత్ రావ్, ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమ్ర రాజు, మాజీ ఉపాధ్యక్షుడు మడావి మాణిక్ రావ్, నాయకులు బాపురావ్, రమేశ్, తుకారాం, టేకం భీంరావ్, వివిధ కొలాం గ్రామాల పటేళ్లు, పాల్గొన్నారు.


