రూ.39 లక్షల విలువైన 200 ఫోన్ల అప్పగింత
ఆదిలాబాద్‌టౌన్: దొంగిలించిన, పోగొట్టుకున్న రూ.39 లక్షల విలువైన సెల్‌ఫోన్‌లను ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ బాధితులకు అప్పగించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో 200 సెల్‌ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇంత పెద్దమొత్తంలో సెల్‌ఫోన్‌లను తిరిగి రాబట్టడం జిల్లా చరిత్రలోనే ప్రథమమన్నారు. రైతు బజార్, రిమ్స్, రైల్వేస్టేషన్, బస్టాండ్, ఇళ్లతో పాటు బంధువులకు ఫోన్ చేస్తానంటూ ఫోన్ తస్కరించడం జరుగుతుందన్నారు. ఇలాంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 1500 సెల్‌ఫోన్లను బాధితులకు అందజేసినట్లు తెలిపారు. మొబైల్ రిపేరింగ్ దుకా ణాల యజమానులు సెల్‌ఫోన్లను కొనుగోలు చేసే ముందు ఫోన్ యజమాని అనుమతి, సరైన పత్రాలు తీసుకోవాలన్నారు. దొంగ ఫోన్లు కొన్నవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాబట్టిన ఫోన్లు ఉత్తర భారతదేశంలో ఉండటంతో వాటిని ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో తిరిగి రాబట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక, ట్రెయినీ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, ఆర్‌ఎస్‌ఐ పి.గోపికృష్ణ, ఎంఎ రియాజ్, మజీద్, త్రిశూల్, అన్వేష్, నవనీత్, తదితరులు పాల్గొన్నారు.


