ఆర్టీసీ.. తీరు మారదేమి?
మంచిర్యాలఅర్బన్: చుట్టూ చూస్తే పల్లెవెలుగు బస్సు. తీరా ఎక్కిన తర్వాత వెంపల్లిలో ఆగుతుందా? అంటే ఇది ఎక్స్‌ప్రెస్ అని ఆర్టీసీ ఉద్యోగుల నుంచి సమాధానం రావడంతో ప్రయాణికులు చేసేదేంలేక దిగిపోకతప్పలేదు. పల్లెవెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డు తగిలించి ఆర్టీసీ అధికారులు అధికచార్జీలు వసూలు చేస్తుండడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. జగిత్యాల, కోరుట్ల, ఇతర డిపోలకు చెందిన పల్లెవెలుగు బస్సులకు ఎక్కువగా ఇలా ఎక్స్‌ప్రెస్ బోర్డులు తగిలించి రాకపోకలు సాగిస్తున్నాయి. కాళేశ్వరం రూట్‌లో మంచిర్యాల డిపో బస్సులు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఆర్డినరీ బస్సుల్లో ఎక్స్‌ప్రెస్ చార్జీలతో ఆర్థికంగా నష్టపోతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. ఇలాంటి చర్యలతో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళల మాటెలా ఉన్నా నగదు చెల్లించి టికెట్ కొనుగోలు చేసే ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది. ఇప్పటికై నా ఆర్టీసీ అధికారులు స్పందించి మరిన్ని బస్సులు వచ్చేలా చొరవ చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు.


