రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నేరడిగొండ: ద్విచక్ర వాహనం ఆటో ట్రాలీని ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన గురువారం మండలంలోని చించోలి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ తెలిపిన వివరాల ప్రకారం.. బజార్‌హత్నూర్ మండలం బలన్‌పూర్ గ్రామానికి చెందిన ఉయికే లింగారావు (30) గురువారం ఉదయం 11 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నాడు. బోథ్ క్రాస్ రోడ్, చించోలి సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ట్రాలీని కుడివైపు నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో లింగారావు తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రమాద సమయంలో ద్విచక్ర వాహనదారుడు మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.


