‘పల్టీ’కొట్టిన జీవితాలు!
మహారాష్ట్రలోని వంతెన పైనుంచి బోల్తాపడిన కారు నలుగురు దుర్మరణం, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు మృతుల్లో ఇద్దరు తల్లీకూతుళ్లు, ఇద్దరు అక్కాచెల్లెళ్లు కాగజ్‌నగర్ పట్టణంలో విషాదం
కాగజ్‌నగర్‌టౌన్: వారంతా దగ్గరి బంధువులే.. మ హారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో గల ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో బంధువును పరామర్శించేందుకు ఒకే కారులో ఏడుగురు వెళ్లారు. మంచీచెడు తెలుసుకుని బంధువుకు ధైర్యం చెప్పి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇళ్లకు బయల్దేరారు. కానీ తిరుగు ప్రయాణంలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి వా గులో బోల్తాపడి తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒకరు బాలిక ఉండటంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. కాగజ్‌నగర్ పట్టణంలోని కౌసర్‌నగర్‌కు చెందిన అఫ్జల్ బేగం(50), సాహెరా బేగం(40), రహెమాన్‌తోపాటు నిజాముద్దీన్‌కాలనీకి చెందిన సల్మాబేగం(40), సబ్రీం(11), నుజహత్, ముషారత్ ఏడుగురు కలిసి బుధవారం ఉదయం నాగ్‌పూర్‌లోని బంధువును పరామర్శించేందుకు కారులో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు బయలుదేరారు. తిరిగి వస్తుండగా అర్ధరాత్రి దాటిన తర్వాత రాజురా జిల్లాలోని దేవాడ, సోండ్‌గాం సమీపంలోని వంతెన పైనుంచి కారు ఒకసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. రాళ్లు ఎక్కువగా ఉండడంతో కారు తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లు సల్మాబేగం, సబ్రీం, కౌసర్‌నగర్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు అఫ్జల్ బేగం, సాహెరా బేగం అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్ రహెమాన్ అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. నుజహత్, ముషారత్‌లకు తీవ్ర గాయాలు కావడంతో చంద్రాపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు మహారాష్ట్రలోనే పోస్టుమార్టం నిర్వహించి గురువారం రాత్రి 6 గంటలకు ప్రత్యేక అంబులెన్స్‌లో కాగజ్‌నగర్‌కు తీసుకువచ్చారు. మృతులంతా సమీప బంధువులే కావడంతో కాగజ్‌నగర్‌లోని బాధితుల ఇళ్ల వద్ద విషాదచాయలు అలుముకున్నాయి. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, స్థానిక నాయకులు బాధిత కుటుంబాలను పరామర్శించారు.


