అక్రమాలకు చెక్
జన్నారం: కవ్వాల్ టైగర్‌జోన్ గుండా వెళ్లే వాహనాలకు పర్యావరణ శిస్తు వసూలు విషయంలో అటవీశాఖ నూతన అధ్యయనానికి తెరతీసింది. ఇందులో భాగంగా అటవీశాఖ చెక్‌పోస్టుల వద్ద డ్యూటీ చేసే సిబ్బంది అక్రమాలకు పాల్పడకుండా, పర్యావరణ శిస్తూ వసూలు ఆటోమేటిక్‌గా కట్ అయ్యేలా ఫాస్టాగ్ ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంతం గుండా వెళ్లే వాహనదారులకు శిస్తు ఫాస్టాగ్ రూపంలో అటవీశాఖ ఖాతాలో చేరనుంది.
ఐదు మండలాల్లో ఆరువేలకు పైనే
టైగర్‌జోన్ పరిధిలోని ఉట్నూర్, కడెం, దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి మండలాల్లో గల వాహనాలకు ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఇచ్చారు. మూడు నెలల క్రితం ఆర్టీవో కార్యాలయం నుంచి తీసుకున్న లిస్టు ప్రకారం ఐదు మండలాల్లో ఆరువేలకు పైగా నాలుగు, ఆరు టైర్ల వాహనాలున్నట్లు గుర్తించారు. అయితే ఫాస్టాగ్ మిషన్లు ఇప్పుడే పూర్తి కావడంతో మరిన్ని వాహనాలు పెరిగే అవకాశం ఉన్నందువల్ల ప్రస్తుతం ఎన్ని వాహనాలు ఉన్నాయనే అంశంపై ఆర్టీవో అధికారులను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. వీటి లెక్క తేలాకే ఫాస్టాగ్ మిషన్‌లో బెంగళూరుకు చెందిన టెక్నీషియన్ ద్వారా ఐదు మండలాల్లోని వాహనాల నంబర్లు నమోదు చేయడంతో వారికి ఫాస్టాగ్ నుంచి మినహాయింపు వస్తుంది.
డబుల్ కట్ అయ్యే ప్రమాదం
టైగర్‌జోన్ పరిఽధిలోని ఉట్నూర్, పాడ్వాపూర్, ఇందన్‌పల్లి, తపాలాపూర్ చెక్‌పోస్టుల వద్ద ఫాస్టాగ్ మిషన్లు ఏర్పాటు చేయగా ఇదే దారి గుండా వెళ్లే వాహనాలకు అన్ని చెక్‌పోస్టుల వద్ద శిస్తు కట్టయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయం ఇటీవల ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధికారులతో మాట్లాడి నిలిపివేయించారు. అయితే టెక్నీషియన్లను పిలిచి ఒక్క చెక్‌పోస్టు వద్ద డబ్బులు కట్టయితే మరో చెక్‌పోస్టు కట్ కాకుండా చూసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నూతన వాహనాల నమోదు, ఒకే చెక్‌పోస్టు వద్ద డబ్బులు కట్ అయ్యేలా నమోదు పూర్తయితే ఫాస్టాగ్ ప్రారంభించే అవకాశం ఉంది.
రశీదు లేకుండానే..
చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహించే కొందరు అటవీ సిబ్బంది పర్యావరణ శిస్తు వసూలు విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. రశీదు లేకుండానే డబ్బులు వసూలు చేయడం, ఎక్కువ తీసుకుని తక్కువ రశీదు ఇవ్వడం లాంటి అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఫాస్టాగ్ ఏర్పాటుతో రశీదు ఇవ్వడం ఉండదు కాబట్టి అక్రమాలకు చెక్ పెట్టవచ్చని అధికారులు యోచిస్తున్నారు.
నాలుగు చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు
కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం, ఉట్నూర్, ఖానాపూర్ అటవీ డివిజన్‌లలో నాలుగు చోట్ల ఫాస్టాగ్ ఏర్పాటు చేశారు. జన్నారం డివిజన్‌లో ని తాళ్లపేట, ఇందన్‌పల్లి, ఖానాపూర్ డివిజన్‌లోని పాడ్వాపూర్, ఉట్నూర్ డివిజన్‌లోని కొత్తగూడెం చెక్‌పోస్టుల వద్ద ఫాస్టాగ్ మిషన్లు ఏ ర్పాటు చేశారు. ఈ దారి గుండా వెళ్లే వాహనదారులకు ఫాస్టాగ్ ద్వారా పర్యావరణ శిస్తూ క ట్ కానుంది. ఇంతకాలం అటవీ దారిగుండా ప్రయాణించే నాలుగు టైర్ల వాహనాలకు రూ. 50, ఆరు టైర్ల వాహనాలకు రూ.150, హెవీ వాహనాలకు రూ.600 పర్యావరణ శిస్తు రశీదు రూపంలో వసూలు చేసే వారు. ఇటీవల ఖానా పూర్ ఎమ్మెల్యే చొరవతో పగటి పూట భారీ వాహనాల రాకపోకలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో హెవీ వాహనాలకు కూడా రూ.150 వసూలు చేస్తున్నారు.


