ఆటో డ్రైవర్‌కు పదేళ్ల జైలు
ఆదిలాబాద్‌టౌన్: మద్యం మత్తులో ఆటో నడిపి మహిళ మృతికి కారణమైన డ్రైవర్‌కు పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.8,500 జరిమానా విధిస్తూ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సీఎం రాజ్యలక్ష్మి సోమవారం తీర్పునిచ్చారు. లైజన్ అధికారి వెంకటమ్మ తెలిపిన ప్రకారం.. 2021 మార్చి 24న సొనాల గ్రామానికి చెందిన పవర్ నిర్గుణ కూరగాయలు అమ్మి తిరిగి బోథ్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సొనాల ఆటోస్టాండ్ నుంచి మద్యం తాగి ఆటో నడుపుతున్న బోథ్‌లోని న్యూ కాలనీకి చెందిన షేక్ జావిద్ పాషా ప్రయాణికులతో బోథ్ వైపు వెళ్తుండగా టీవీటీ గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. దీంతో రెండు ఆటోలు పల్టీలు కొట్టగా ప్రయాణికులు గాయపడ్డారు. తీవ్ర గాయాలపాలైన పవర్ నిర్గుణను ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతిచెందింది. ఈ ఘటనపై బాధితురాలి కుమారుడు పవర్ అరవింద్ ఫిర్యాదు మేరకు బోథ్ పోలీస్ స్టేషన్‌లో అప్పటి ఎస్సై రాజు కేసు నమోదు చేయగా, సీఐ ఎం.నైలు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు డ్యూటీ అధికారి డి.శ్రీనివాస్ 19 మంది సాక్షులను హాజరుపర్చగా, పీపీ షాహినా సుల్తానా వాదనలు వినిపించగా నేరం రుజువైంది. కేసు ఛేదనలో కీలకపాత్ర పోషించిన పోలీసులు, కోర్టు డ్యూటీ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
గంజాయి సాగు కేసులో ఐదేళ్ల జైలు శిక్ష
ఆసిఫాబాద్‌అర్బన్: గంజాయి సాగు చేసిన కేసులో ఒకరికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.50వేల జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ తీర్పు వెలువరించినట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. ఎస్పీ కథనం ప్రకారం.. జైనూర్ మండలం బూసిమెట్ల గ్రామంలోని పత్తి పంటలో బోలె పాండురంగ్ నిషేధిత గంజాయి సాగు చేస్తున్నట్లు 2023 అక్టోబర్ 18న ఎస్సై సందీప్ ఆధ్వర్యంలో పోలీసులు గుర్తించారు. తనిఖీల్లో 50 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్సై రాథోడ్ ఉమేశ్ కేసు నమోదు చేయగా, జైనూర్ సీఐలు మల్లేశ్, అంజయ్య విచారణ చేపట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జగన్మోహన్‌రావు వాదనలు వినిపించగా నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రస్తుత ఎస్సై రవికుమార్, సీఐ రమేశ్, ఏఎస్పీ చిత్తరంజన్, కోర్టు లైజనింగ్ అధికారి రామ్‌సింగ్‌ను అభినందించారు.
దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి
ఉట్నూర్‌రూరల్: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ ఏవో దామోదర స్వామి అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయా సమస్యలపై గిరిజనులు అందించిన దరఖాస్తులు స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


