
● నగరవాసులకు కాజ్‌వే కష్టాలు ● ప్రతియేటా వరదలకు కొట్టుక
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలోని రాళ్లవాగుపై నిర్మించిన కాజ్‌వే ప్రతియేటా వర్షాకాలంలో వరద తాకిడికి కొట్టుకుపోతోంది. రాకపోకలకు అంతరాయం కలిగిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాజ్‌వే మునిగిపోయింది. పై నుంచి రాళ్లవాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో వాగుపై రాకపోకలు సాగించేందుకు నిర్మించిన కాజ్‌వే కొట్టుకుపోయింది. ఆ ప్రాంతంలో ప్రతీ ఏడాది నిధులు కేటాయించి, రాకపోకలు సక్రమంగా సాగేలా తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు. ప్రస్తుతం కూలిన వంతెనతో రాకపోకలు నిలిచిపోగా.. ద్విచక్ర వాహనదారులు వెళ్లేందుకు తాత్కాలిక మరమ్మతులు చేశారు. ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ప్రమాదం అంచున ప్రయాణిస్తున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా సరే వాగులో పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ ఏడాదీ వర్షాకాలంలో కాజ్‌వేతో కష్టాలు తప్పేలా లేవు.
2005లో నిర్మాణం
మంచిర్యాల నగరంలోని రంగంపేట్‌కు మంచిర్యాల లక్ష్మీటాకీస్, బైపాస్ రోడ్డు నుంచి వెళ్లేందుకు గాను 2005లో రూ.80లక్షల వ్యయంతో రాళ్లవాగులో పైపులు వేసి కాజ్‌వే వంతెన నిర్మించారు. బైపాస్ రోడ్డులోని తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి రాళ్లవాగు మీదుగా నిర్మించిన కాజ్‌వే పైనుంచి రంగంపేట్, పవర్‌సిటీ, ఆండాళమ్మ కాలనీ, పాతమంచిర్యాలకు వెళ్లే ప్రజలు రాకపోకలు సాగించేందుకు వినియోగిస్తున్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు కాజ్‌వే మునిగిపోయి, ఆయా కాలనీలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. పాతమంచిర్యాల వద్ద రాళ్లవాగుపై జాతీయరహదారిపై ఉన్న వంతెన మీదుగా రంగంపేట్‌కు వెళ్లాలంటే కనీసం ఐదారు కిలోమీటర్లు అదనంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏటా వర్షాకాలంలో వరద నీటిలోనే కాజ్‌వే ఉండడం, కొన్నేళ్లలోనే కాజ్‌వే కోతకు గురై రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
2019లో కూలిన వంతెన
ప్రతి ఏటా వర్షాకాలంలో కాజ్‌వే వరద నీటిలో కోతకు గురవుతూనే ఉంది. 2019లో కురిసిన భారీ వర్షాలతో కాజ్‌వే కూలింది. దీంతో ప్రతియేటా వర్షాలు కురుస్తున్నప్పుడు వరద నీటికి కోతకు గురవుతూనే ఉంటుంది. వర్షాలు ముగిసిన తర్వాత తాత్కాలిక మరమ్మతులు చేపడుతుండడంతో రాకపోకలు సజావుగా సాగుతున్నాయి. కాజ్‌వే స్థానంలో బ్రిడ్జి నిర్మాణానికి గాను గత ఏడాది మార్చి 10న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు రూ.13.50 కోట్ల టీఎఫ్‌ఐడీసీ నిధులతో పనులు ప్రారంభించారు. ఆ తర్వాత రంగంపేట్‌లోని శాలివాహన పవర్ ప్రాజెక్టు సమీపంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుతో రోడ్ల వెడల్పు పనులను మంచిర్యాల నగరంలో చేపట్టేందుకు నిర్ణయించారు. రోడ్ల వెడల్పులో భాగంగా ఆరు లైన్ల రహదారిని నిర్మించాలని నిర్ణయించడంతో బ్రిడ్జి నిర్మాణం సైతం రోడ్డుకు సరిపడా చేపట్టాలని నిర్ణయించారు. ఈ ఏడాది వర్షాకాలం పూర్తికాగానే పనులు ప్రారంభించనున్నారు. ప్రస్తుత వర్షాకాలం ముగిసే వరకు రంగంపేట్, ఆండాళమ్మ కాలనీ, పాతమంచిర్యాల, పవర్‌సిటీ ప్రాంత ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది.

● నగరవాసులకు కాజ్‌వే కష్టాలు ● ప్రతియేటా వరదలకు కొట్టుక