ప్రభుత్వ భూమిని కాపాడడానికి నేనున్నా
● మీరు అటవీ భూములు కాపాడండి..
● ఎఫ్‌ఆర్‌వోపై కలెక్టర్ కుమార్ దీపక్ ఆగ్రహం ● మందమర్రి మండలం శేషుపల్లి గ్రామానికి చెందిన నక్క పవన్‌కుమార్ తమ కుటుంబం కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని కొందరు ఆక్రమించుకుని బెదిరిస్తున్నారని, విచారణ జరిపి న్యాయం చేయాలని ఫిర్యాదు చేశాడు.
● 20ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి పట్టా ఇప్పించాలని కన్నెపల్లి మండలం దాంపూర్ గ్రామానికి చెందిన ఆర్కాం గంగారం, అర్కాం పోషయ్య దరఖాస్తు అందజేశారు.
● మందమర్రి మండలం శంకర్‌పల్లి గ్రామస్తులు తమ గ్రామం నుంచి సండ్రోన్‌పల్లి గ్రామానికి వెళ్లే రహదారి మరమ్మతులు చేపట్టి పాలవాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు.
● ఆసరా పింఛన్ ఇప్పించాలని మందమర్రి మండలం ఊరు రామకృష్ణాపూర్‌కు చెందిన బచ్చల మోహన్, వితంతు పింఛన్ ఇప్పించాలని అమరవాదికి చెందిన తోటపల్లి లలిత, వేలిముద్రలు, ఐరిస్ రాక పింఛన్ రావడం లేదని, పింఛన్ ఇప్పించాలని క్యాతనపల్లి పట్టణం గద్దెరాగడికి చెందిన గుర్రం లక్ష్మి అర్జీ సమర్పించారు.
మంచిర్యాలఅగ్రికల్చర్: ‘ప్రభుత్వ భూములను కాపాడడానికి నేనున్నా.. అటవీ భూములను కాపాడడానికి మీరు చర్యలు తీసుకోండి.. అన్నిట్లో తలదూర్చి సాగు చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ రైతులను ఇబ్బంది పెట్టకండి.. ఇంతకుముందే చెప్పినా.. నేను ఎంత చెప్పినా మళ్లీ అలానే చేస్తున్నారు. ప్రభుత్వ భూములపై మీరెందుకు తల దూర్చుతున్నారు..’ అంటూ కలెక్టర్ కుమార్ దీపక్ కుశ్నపల్లి అటవీ శాఖ రేంజర్(ఎఫ్‌ఆర్‌వో) దయాకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తే క్రిమినల్ కేసులు పెట్టండి అంటూ నెన్నెలకు చెందిన బాధితులకు కలెక్టర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.