
విద్యార్థులకు రాగిజావ
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పోషకాహార లోపంతో బాధపడొద్దని ప్రభుత్వం గతంలో రాగిజావ పంపిణీ చేసింది. ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభమైనా పంపిణీ లేకపోవడంతో విద్యార్థులు ఎదురు చూడాల్సి వస్తోంది. విద్యార్థులు ఉదయం ఖాళీ కడుపుతో వస్తుండడం, రక్తహీనత, పోషకాహారలోపం ఉండడం వల్ల తరగతి గదుల్లో నీరసంగా కనిపించేవారు. సమస్య నివారణకు ప్రభుత్వం రాగి జావ అందిస్తూ వచ్చింది. వేసవి సెలవుల అనంతరం రాగిపిండి, బెల్లం సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులకు అందకుండా పోయింది. ప్రభుత్వం ఇటీవల రాగిజావ పంపిణీ చేస్తామని చేసిన ప్రకటన ఊరటనిస్తోంది.
అంకుర్పారణ ఇలా..
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బెంగళూర్ కేంద్రంగా సేవ కార్యక్రమాలు నిర్వహించే సత్యసాయి ట్రస్టు, అన్నపూర్ణ ట్రస్టు ఆధ్వర్యంలో 2015లో కొన్ని పాఠశాలల్లో రాగిజావ అందించారు. తర్వాత ప్రభుత్వ సహకారంతో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అందించేలా చర్యలు తీసుకున్నారు. కరోనా సమయంలో కొంత కాలం నిలిచిపోయింది. మళ్లీ 2022–23 నుంచి రాగిజావ పౌడర్(పిండి) సరఫరా చేశారు. ఈ ఏడాది మార్చిలో సరఫరా చేసిన పిండితో ఏప్రిల్‌లో విద్యార్థులకు రాగిజావ అందించారు. వేసవి సెలవులు రావడం.. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా పునః పంపిణీకి నోచుకోలేదు.
సరఫరా ఇలా..
నిరుపేద పిల్లలు సరైన పోషకాహారం అందక జబ్బుల బారిన పడుతున్నట్లు గుర్తించి పోషకాలతో ఉదయం వేళ రాగిజావ అందించారు. రాగిపొడి, బెల్లంను నాణ్యమైన ఆర్గానిక్ పోషకాలతో తయారు చేసి పాఠశాలలకు అందించారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీల ద్వారా రాగిజావ తయారు చేయించి పిల్లలకు పంపిణీ చేశారు. ఒక్కో విద్యార్థికి 10గ్రాముల రాగిపిండి, 5గ్రాముల బెల్లంతో రాగిజావ అందిస్తున్నారు. ఇందుకు అవసరమైన రాగిపిండి, బెల్లం బస్తాలను ట్రస్టు నిర్వాహకులు ఆయా మండల విద్యావనరుల కేంద్రాలకు సరఫరా చేయగా అక్కడి నుంచి పాఠశాలకు చేరుస్తున్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు తమవంతు సహకారంతో రాగిజావ పంపిణీ చేశారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,68,289మందికి లబ్ధి..
ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు రాగిజావ సరఫరా చేస్తూ వస్తోంది. ఈ పథకం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 1,68,289 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఆది లాబాద్ జిల్లాలో 55,634, మంచిర్యాలలో 34,057, ఆసిఫాబాద్ కుమురంభీం జిల్లాలో 38788, నిర్మల్‌లో 39,810 మంది ఉన్నారు. ముడి సరుకులు రాకపోవడంతో కొంత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. సెప్టెంబర్‌లో రాగిపిండి సరఫరా కానుందని ఓ అధికారి చెప్పుకొచ్చారు. రాగిపిండి రాగానే రాగిజావ పంపిణీని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.