
రోగమొస్తే జిల్లా కేంద్రానికే!
పాము కాటేసినా.. కుక్క కరిచినా మంచిర్యాలకు వెళ్లాల్సిందే..
ప్రాథమిక వైద్యానికీ నోచుకోని రామకృష్ణాపూర్ వాసులు
మున్సిపాలిటీగా మారినా వైద్యసేవలు మృగ్యం
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్ పట్టణంలో 40 వేలకుపైగా జనాభా ఉంది. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. అయినా ఇప్పటికీ పట్టణవాసులకు ఏ రోగమొచ్చినా జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిందే. పాము కాటేసినా.. కుక్క కరిచినా.. గుండెపోటు వచ్చినా.. స్థానికంగా ప్రాథమిక చికిత్స కూడా అందదు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవాల్సిందే. ఎందుకంటే ఇంతమంది జానాభా ఉన్నా.. కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగానీ, అర్బన్ హెల్త్ సెంటర్ కానీ లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న ఈ ప్రాంతం, నేడు మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయినా ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకునేవారు లేరు. ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటుకు చొరవ తీసుకునే వారు లేరని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు.
వైద్యుడు లేని సబ్‌సెంటర్..
రామకృష్ణాపూర్‌లో హెల్త్ సబ్‌సెంటర్ మాత్రమే ఉంది. అందులోనూ వైద్యుడు ఉండడు. ఒక ఆశ కార్యకర్త, ఒక అసిస్టెంట్‌తో నడుస్తోంది. జ్వరం, జలుబు, కడుపునొప్పి వంటి సాధారణ వ్యాధులకు కూడా 10 కిలోమీటర్ల దూరంలోని మంచిర్యాలలోని జిల్లా ఆస్పత్రికి వెళ్లాల్సిందే. గతంలో సమీర్ అనే యువకుడిని పాము కాటేసింది. అతడిని మంచిర్యాలకు తీసుకెళ్లేలోగా ప్రాణాలు పోయాయి.
ఏరియా ఆస్పత్రి ఉండి ఏం లాభం...?
పట్టణంలో సింగరేణి సంస్థ నిర్వహించే ఏరియా ఆస్పత్రి ఉంది. కానీ ఇందులో కార్మికేతరులకు ప్రాథమిక చికిత్స కూడా అందించరు. అత్యవసర సమయాల్లో సామాన్యులు ఈ ఆస్పత్రికి వెళ్తే.. ‘మీరు సింగరేణి కార్మికులు కాదు, వేరే ఆస్పపత్రికి వెళ్లండి’ అంటూ తిరస్కరిస్తున్నారు. రోగి పరిస్థితి విషమంగా ఉన్నా ప్రాథమిక చికిత్స కూడా చేయరు. గత్యంతరం లేక ప్రజలు ఆర్‌ఎంపీల వద్దకు లేదంటే జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అయిన గడ్డం వివేక్ వెంకటస్వామి ఈ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని, ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.