
అభివృద్ధిలో హైదరాబాద్‌కు దీటుగా మంచిర్యాల
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నియోజకవర్గాన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం 2027 డిసెంబర్ కల్లా హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్య, వైద్యం, ఉపాధికి పెద్దపీట వేస్తున్నామని, ఇప్పటికే లక్సెట్టిపేటలో హైస్కూల్, కాలేజీ నిర్మాణంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంలో ఉందని తెలిపారు. మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. మంచిర్యాల జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల భవనాన్ని కూల్చి ఆ స్థానంలో అధునాతన భవనాన్ని నిర్మిస్తామని, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్యను ఒకేచోట అందిస్తామని తెలిపారు. జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలోనూ ఇంటర్మీడియెట్, ప్రస్తుతం కాలేజీ రోడ్డులో ఉన్న జూనియర్ కాలేజీలో 6 నుంచి 10వ తరగతి వరకు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. డీసీసీ అధ్యక్షురాలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు ఇస్తే బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో వారికే తెలియాలని అన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు అభివృద్ధిపై విమర్శలను మానుకోవాలని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంలో 2018లో జరిగిన ఎన్నికల్లో 20 వేల ఓట్లను తొలగించి, తాను 4 వేల చిల్లర ఓట్లతో ఓడిపోయేలా చేశారని, ఎన్నికలు ముగిసిన తర్వాత తొలగించిన ఓట్లను కలిపారని అన్నారు. ఎన్నికల సంఘం ఓట్లను ఎందుకు తొలగిస్తుంది, ఎందుకు చేరుస్తుందని ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ పోరాటం చేస్తున్నారని, ఓట్ల తొలగింపులపై ప్రజల్లోకి వెళ్తున్నారని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.