
అనర్థమే..!
పెరిగిన రసాయనిక ఎరువుల వినియోగం నిస్సారమవుతున్న నేలలు పంటలకు చీడపీడల ముప్పు ఎరువుల యాజమాన్యంపై అవగాహన తప్పనిసరి
మితిమీరితే
ఉమ్మడి జిల్లాలోని రైతులు పంటల ఎదుగుదలకు, అధిక దిగుబడులే లక్ష్యంగా యూరి యా, డీఏపీ తదితర ఎరువులను అధికంగా వినియోగిస్తున్నారు. రైతులు ఎక్కువగా పత్తి, వరి పంటలు సాగు చేస్తుండగా పంటల్లో ఎరువుల వాడకంపై వారికి అవగాహన ఉండటం లేదు. వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తల సూచనలు పట్టించుకోకుండా ఇతర రైతులు వాడుతున్నారని అవసరం ఉన్నా, లేకున్నా ఎడపెడా రసాయనిక ఎరువులు వినియోగిస్తున్నారు. దీంతో నేల నిస్సారంగా మారడంతో పాటు పెట్టుబడులు పెరిగి రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఎరువుల యాజమాన్యంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
– మంచిర్యాలఅగ్రికల్చర్
ఉమ్మడి జిల్లాలో 16.50 లక్షల ఎకరాల్లో వివిధ రకా ల పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో అధికంగా పత్తి పంట 10.30 లక్షల ఎకరాల్లో, వరి పంట 4.20 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్, రబీలో మొత్తంగా 3.80 లక్షల ట న్నుల రసాయనిక ఎరువులు వినియోగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నల్లరేగడి భూములు 70శాతం ఉండగా 30 శాతం వరకు ఎర్ర, చౌడు తదితర నేలలు ఉన్నాయి.
ఎరువుల అధిక వినియోగం..
రైతులు పంటల ఎదుగుదలకు, దిగుబడులకు నాలుగైదు దఫాలుగా రసాయనిక ఎరువులు విని యోగిస్తున్నారు. దీంతోపాటు తెగుళ్ల నివారణ కోసం ఏళ్ల తరబడి రసాయనిక ఎరువులు, పురుగు మందులను పెద్ద మొత్తంలో వినియోగిస్తున్నారు. రైతులు దిగుబడి లక్ష్యంగా అవగాహన లోపంతో అవసరం లేకున్నా ఎరువులు, పురుగుల మందులు వాడుతూ ఆర్థికంగా, నేలనిస్సారంగా మారి నష్టపోతున్నారు. ఏటా ఉమ్మడి జిల్లా రైతులు ఎరువులకు రూ.340 కోట్ల వరకు, పురుగు మందులకు రూ.230 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. విచ్చలవిడిగా రసాయన ఎరువుల వాడకం వల్ల పచ్చని పొలాలు విషతుల్యమవుతుండగా, దిగుబడుల కంటే పెట్టుబడులే ఎక్కువై అప్పుల పాలవుతున్నారు. సేంద్రియ ఎరువులు తగ్గించి రసాయనిక మందులు వాడడం వల్లనే ఈ దుస్థితి నెలకొంటుంది.
సకాలంలో భాస్వరం..
మొక్కల వేరుల పెరుగుదల పోషక పదార్థంగా భా స్వరం ఉపయోగపడుతుంది. దీనిని నాట్లు వేసే ముందు దమ్మలో లేదా నాట్లు వేసిన 15 రోజుల్లోపు కాంప్లెక్స్ ఎరువుగా వాడాల్సి ఉంటుంది. నాట్లు వేసిన 15 రోజుల తరువాత ఈ ఎరువును పొలంలో చల్లుకున్నా ఉపయోగం ఉండదు. అయితే పొలంలో జింక్‌లోపం తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ ఎరువును సకాలంలో పైరుకు అందిస్తేనే మొక్కల ఎదుగుదల బాగుంటుంది.
పొటాష్‌తో రోగ నిరోధక శక్తి..
రోగ నిరోధక శక్తి పెంచడానికి, అవసరమైన పోషకాలను మొక్కలోని వివిధ భాగాలకు సరఫరా చేయడానికి పొటాష్ ఉపయోగపడుతుంది. పంటకు అవసరమయ్యే మొదటి దఫాలో 12 నుంచి 16 కిలోలు, రెండో దఫాలో 20 నుంచి 27 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను పొలంలో చల్లుకోవాలి. దీనిని రెండు సమభాగాలుగా చేసి మొదటి దఫా, రెండో దఫా యూరియాతో కలిపి వేస్తే ఆశించిన దిగుబడులు సాధించవచ్చు.
పత్తిలో ఎరువు వేసేందుకు
సిద్ధం చేస్తున్న రైతు
మూడు విడతలుగా యూరియా..
వరిపైరు పెరిగేందుకు నత్రజని ఎంతగానో దోహదపడుతుంది. దీనిని మూడు దఫాలు గా పొలంలో చల్లుకోవాలి. నాట్లు వేసే ముందు, ఎదిగే దశలో, పొట్టకు వచ్చే దశలో నత్రజనిని అందించే ఎరువులు వాడుకోవాలి. నత్రజని పోషకాన్ని సరైన మోతాదులో పంటకు అందించేందుకు యూరియా వాడే విధానంపై రైతులకు అవగాహన ఉండాలి. ఎకరానికి 25 నుంచి 32 కిలోల నత్రజని అందించాలంటే 55 నుంచి 70 కిలోల యూరియాను పొలంలో చల్లుకోవాలి. దీనిని మూడు సమ భాగాలుగా విభజించి చల్లుకోవాల్సి ఉంటుంది. పైరు పెరుగుదల ఆశించిన రీతిలో లేకుంటే అదనంగా 10 నుంచి 15 కిలోల వరకు యూరియా వాడొచ్చు. యూరియా అధిక వినియోగం వల్ల అనేక అనర్థాలు ఎదురవుతాయి. యూరియా ఎక్కువైతే వరి మొక్కల ఆకుల్లో పత్రహరితం అధికంగా ఉండి పురుగులు దాడి చేస్తాయి. అగ్గితెగులు, ఆకుముడుత తెగులు కూడా సోకే ప్రమాదం ఉంటుంది.
మోతాదు మించొద్దు..
ఉమ్మడి జిల్లాలో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉన్నా అందులో నత్రజని లోపం అధికంగా ఉంది. చౌడు భూముల్లో జిప్సం, సల్ఫర్ లోపం ఉంది. పత్తి, వరి సాగు అధికంగా చేస్తుండగా దిగుబడికి రైతులు రసాయనిక ఎరువులు వినియోగిస్తున్నారు. దీంతో భూసారం దెబ్బ తింటుంది. రైతులు పంట మార్పిడి చేస్తే దిగుబడులు పెరుగుతాయి. సేంద్రియ ఎరువులు పశువుల పేడ, పచ్చిరొట్టె ఎరువులు, వర్మీ కంపోస్టు వేసుకుంటే నత్రజని లోపం అధిగమించవచ్చు.
– రాజశేఖర్, శాస్త్రవేత్త,
ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం

అనర్థమే..!