
చోరీ చేసి.. రైలెక్కి..!
కాగజ్‌నగర్ పట్టణంలోని జ్యువెలరీ షాపులో దొంగతనం వెండి ఆభరణాలతో రైలులో పరారైన మహిళలు అదుపులోకి తీసుకున్న పోలీసులు
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణంలోని రాజీవ్‌గాంధీ చౌరస్తా సమీపంలోని బ్రహ్మానందం అండ్ సన్స్ జ్యువెలరీ షాపులో గుర్తు తెలియని నలుగురు మహిళలు దొంగతనానికి పాల్పడ్డారు. ఆదివారం మధ్యాహ్నం షాపులోకి వచ్చిన ముగ్గురు మహిళలు తమకు పట్టగొలుసులు కావాలని షాపు నిర్వాహకులను అడిగారు. దీంతో వారు పట్టగొలుసులను బయటకు తీసి చూపెట్టారు. ఈ క్రమంలో అదే గ్రూప్‌నకు చెందిన మరో మహిళ షాపులోకి వచ్చి తనకు మట్టెలు కావాలని అడిగి మిగితా మహిళల పక్కన నిల్చొంది. ఈక్రమంలో షాపు నిర్వాహకులను బురిడీ కొట్టించి సుమారు రూ.1.50 లక్షల వెండి ఆభరణాలను వారు దొంగిలించారు. షాపు యజమానికి అనుమానం వచ్చి నిలదీయగా తమకు ఏం తెలియదంటూ షాపు నుంచి వెళ్లిపోయారు. దీంతో షాపులోని సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించగా దొంగతనం బయటపడింది. వెంటనే షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించారు. మహిళల జాడ కోసం పోలీసులు గాలించగా మహిళలు కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి వెళ్లిపోయినట్లు తెలుసుకున్నారు. సీఐ ప్రేంకుమార్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై కాగజ్‌నగర్ పట్టణ సీఐ ప్రేం కుమార్‌ను సంప్రదించగా నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నామని, వరంగల్ జిల్లాకు చెందిన వారిగా అనుమానిస్తున్నామన్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.