
చోరీ ఘటనలో నిందితురాలి అరెస్ట్
బెల్లంపల్లిరూరల్: పెళ్లి సంబంధం ఉందని నమ్మబలికి కుటుంబ సభ్యులను బురిడీ కొట్టించి ఆ ఇంట్లోనే దొంగతనం చేసిన నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం బెల్లంపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ చందవోలు హనోక్ వివరాలు వెల్లడించారు. బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల గ్రామానికి చెందిన ఇందూరి చంద్రశేఖర్ తమ్ముడికి పెళ్లి సంబంధం చూస్తానని గొల్లగూడెం (కన్నాల)కు చెందిన పుల్లగొర్ల పుష్పలత ఈ నెల 22న ఫోన్ చేసి మంచిర్యాలకు రావాలని సూచించింది. దీంతో చంద్రశేఖర్ కుటుంబసభ్యులతో మంచిర్యాలకు వెళ్లాడు. పథకం ప్రకారం పుష్పలత చంద్రశేఖర్ ఇంటి తాళం పగులకొట్టి బీరువాలోని రూ.2 లక్షల విలువ చేసే రెండు తులాల బంగారు నక్లెస్, రూ.15 వేల నగదు అహరించింది. చంద్రశేఖర్ ఇంటికి వచ్చే సరికి బీరువా తాళం పగలకొట్టి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పుష్పలత తన ఇంటికి వచ్చి వెళ్లిన విషయాన్ని పోలీసులకు తెలపడంతో ఆ కోణంలో విచారణ చేపట్టారు. ఆదివారం పుష్పలత శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే కమాన్ వద్ద ఉందని అందిన సమాచారంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద ఉన్న చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని జూనియర్ సివిల్ జడ్జి ముఖేష్ ఎదుట హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎస్సై బండి రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.