బ్యాంకు బంగారం తాకట్టు! | - | Sakshi
Sakshi News home page

బ్యాంకు బంగారం తాకట్టు!

Aug 24 2025 8:38 AM | Updated on Aug 24 2025 8:38 AM

బ్యాంకు బంగారం తాకట్టు!

బ్యాంకు బంగారం తాకట్టు!

అప్పు తీసుకుని వడ్డీ వ్యాపారులకు అప్పగింత ఖాతాదారుల సొమ్మును పక్కదారి పట్టించిన ఉద్యోగి ‘చెన్నూరు ఎస్‌బీఐ’లో కుంభకోణం కేసులో దర్యాప్తు ముమ్మరం

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భారతీయ స్టేట్‌ బ్యాంకు(ఎస్‌బీఐ) చెన్నూర్‌ బ్రాంచ్‌–2లో ఇంటి దొంగలే ఖాతాదారుల సొమ్ము మాయం చేయడంపై దర్యా ప్తు ముమ్మరంగా సాగుతోంది. బ్యాంకులో భద్రంగా ఉండాల్సిన బంగారం, నగదు తన సొంత అవసరాలకు ఉద్యోగి వడ్డీ వ్యాపారుల చేతిలో పెట్టాడు. కిలోల కొద్దీ తెలిసిన వ్యక్తుల వద్ద కుదువ పెట్టి భారీ మొత్తంలో అప్పులు తీసుకున్నాడు. బ్యాంకు జరిగి న భారీ కుంభకోణంపై అధికారులు కేసు పెట్టడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు ఖాతాదారుల సొమ్ము తిరిగి స్వాధీనం చేసుకునేలా ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు 10 మంది లావాదేవీల్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. బ్యాంకు ఉద్యోగికి సహకరించిన జైపూర్‌ మండలానికే చెందిన పలువురు బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు చేరినట్లు ప్రాథమికంగా తేలింది. ప్రధాన నిందితుడైన క్యాషియర్‌ పరారీలో ఉండడంతో పూర్తి సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. మరోవైపు బ్యాంకు మేనేజర్‌తో సహా క్యాషియర్‌పై కేసు నమోదు కాగా, అనుమానితులను విచారణ చేస్తున్నారు. అయితే ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.

నగదుగా మార్చి..

బ్యాంకులో ఖాతాదారులు బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటారు. ఈ బంగారాన్ని బ్యాంకులో అత్యంత రహస్యంగా భద్రపరుస్తారు. బ్రాంచి మేనేజర్‌తోపాటు క్యాషియర్‌ కీలకంగా ఉంటారు. నగదు, బంగారాన్ని భద్రపర్చిన లాకరుకు సంబంధించిన రెండు తాళంచెవిలు ఇద్దరి వద్దే ఉంటాయి. అయితే.. గత ఏడాదిగా రూ.12.61కోట్ల విలువైన బంగారం, రూ.కోటికి పైగా నగదు మాయం అవుతున్నప్పటికీ అక్కడి బాధ్యులకు తెలియకపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బ్యాంకులో ఉన్న బంగారాన్ని స్థానిక వడ్డీ వ్యాపారులకు కుదువ పెట్టి రూ.లక్షల కొద్దీ అప్పులు తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంకు ఉద్యోగి నేరుగా బంగారం కిలోలకొద్దీ కుదువపెడితే అనుమానం వస్తుందని తనకు తెలిసిన వారికి ఇస్తూ వారి నుంచి వడ్డీ వ్యాపారులకు బంగారాన్ని ఇస్తూ ఆపై నగదుగా మార్చినట్లుగా తెలుస్తోంది. బంగారం వాస్తవ విలువ కంటే తక్కువగానే నగదు తీసుకున్నట్లుగా సమాచారం. జైపూర్‌ మండలానికి చెందిన పలువురు ఇదంతా తెలిసే బ్యాంకు ఉద్యోగికి సహకరించారా..? లేక వీరికి కూడా ఏదైనా డబ్బు ఆశ చూపారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ బ్యాంకు ఉద్యోగికి రూ.లక్షల కొద్దీ డబ్బు అవసరం ఎందుకొచ్చింది..? ఆన్‌లైన్‌ గేమ్స్‌, బెట్టింగ్స్‌, మార్కెటింగ్‌లో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా దివాళా తీసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక ఆ ఉద్యోగి తెలిసిన వారందరి వద్ద అప్పులు చేయడంతో పెద్ద మొత్తంలోనే అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో పని చేస్తున్న బ్యాంకుకే కన్నం వేసేందుకు ఒడిగట్టినట్టు తెలుస్తోంది. ప్రధాన నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సెల్‌ఫోన్‌ లొకేషన్‌, తదితర కోణాల్లో వెతుకుతూ వీలైనంత త్వరగా పట్టుకునేలా కేసు ముమ్మరం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement