
మాదారం బీట్‌లో పెద్ద పులి సంచారం
తాండూర్: బెల్లంపల్లి అటవీ రేంజ్ పరిధిలోని మాదారం బీట్‌లో పెద్దపులి సంచరిస్తోంది. కాసిపేట మండలం బుగ్గ గూడెం అడవుల్లో నుంచి శనివారం తాండూర్ మండల పరిధిలోని గొంతెమ్మగుట్ట, చింతల లొద్ది అటవీ ప్రాంతంలోకి వచ్చినట్లు పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని అడవుల్లో సంచరిస్తున్న పెద్దపులితాజాగా ఇటు వచ్చినట్లు తెలుస్తోంది. పులి పాదముద్రల ఆధారంగా తిర్యాణి గుట్ట వైపు పులి ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. పెద్దగుట్ట ఎక్కితే కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి అడవిలోకి వెళ్లే అవకాశం ఉంది. అలా కాకుండా పులి దారి మార్చుకుంటే తాండూర్ మండలం పెగడపల్లి అటవీలోకి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా మాదారం, నీలయపల్లి, కిష్టంపేట, మాదారం–3 ఇంక్‌లైన్ గ్రామాలకు సమీపంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో రైతులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.