
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
నెన్నెల: మండలంలో కురుస్తున్న భారీ వర్షాలు దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అధికారులకు సూచించారు. మండల కేంద్రంలో జలమయమైన ప్రాంతాలు, వాగులను శనివారం పరిశీలించారు. సుంకరివాడలోని నారాయణ, పురంశెట్టి రాకేశ్ ఇళ్లలోకి చేరిన వర్షపు నీటిని తొలగించాలని ఎంపీవో శ్రీనివాస్, కార్యదర్శి సురేశ్‌ను ఆదేశించారు. ఇళ్లలో నిలిచిన నీరు బయటకు వెళ్లేలా నూతనంగా వేసిన సీసీ రోడ్డు పక్క నుంచి కాలువ తీయాలని, నీళ్లు వెళ్లేందుకు అడ్డంగా ఉన్న మెట్లు తొలగించాలని సూచించారు. తహసీల్దార్, మండల పరిషత్, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ నిలిచిన నీటిని తొలగించే ఏర్పాట్లు చేయాలన్నారు. కొత్తగూడంలో ఏర్పడిన కుమ్మరివాగు ప్రాజెక్టు ఎడమ కాల్వ గండిని సందర్శించి వెంటనే ఇసుక బస్తాలతో పూడ్చాలని ఇరిగేషన్ ఏఈని ఫోన్‌లో ఆదేశించారు. లంబాడితండా ఎర్రవాగును సందర్శించి పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో అబ్దుల్‌హై, ఇన్‌చార్జి తహసీల్దార్ ప్రకాశ్ తదితరులు ఉన్నారు.