
ప్రయాణికులను కాపాడిన సీఐ
ఖానాపురం: వరద నీటిలో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని వరంగల్ జిల్లా దుగ్గొండి సీఐ సాయిరమణ కాపాడారు. వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లాకు చెందిన బాస లక్ష్మీనారాయణ, అన్నపూర్ణ, రితిక, రితిన్ భద్రాచలానికి కారులో వెళ్తున్నారు. ఖానాపురం మండలంలోని చిలుకమ్మనగర్–కొత్తగూడ మధ్యలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో చిక్కుకుపోయారు. వెంటనే లక్ష్మీనారాయణ పోలీసులకు సమాచారం అందించారు. డీజీ కంట్రోల్ కార్యాలయం నుంచి స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో సీఐ సాయిరమణ శనివారం తెల్లవారుజామున 3 గంటలకు చిలుకమ్మనగర్‌కు చేరుకుని గ్రామస్తుల సహకారంతో వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. సదరు కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.