కాగజ్‌నగర్‌రూరల్: మండలంలోని సార్సాల పరిసరాల్లో చిరుత సంచరించింది. శుక్రవారం రాత్రి బూరం పోచన్నకు చెందిన గేదె దూడపై దాడి చేసి హతమార్చింది. అదే ప్రాంతంలో కుక్కపై దాడి చేసి చంపింది. శనివారం తెల్లవారు జాము ఓ మహిళకు చెందిన పశువులపై దాడికి యత్నించడంతో అవి తప్పించుకున్నాయని గ్రామస్తులు తెలిపారు. శనివారం ఫారెస్ట్ సెక్షన్ అధికారి సుభాన్, బీట్ అధికారి శ్రీవాణి, సిబ్బందితో సందర్శించి చిరుత పాదముద్రలను సేకరించారు. తక్షణ సహాయం కింద గేదె దూడ యజమానికి రూ.5 వేల పరిహారం అందజేశారు. చిరుతపులి సంచారంపై డప్పు చాటింపు చేశారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.