
కడెం వరదలో వ్యక్తి గల్లంతు
చేపల కోసం కడెం గేట్ల కిందకు వెళ్లి.. ప్రవాహం పెరిగి, నీటిలో కొట్టుకుపోయి రాత్రివేళ గాలింపు నిలిపివేత
కడెం/దస్తురాబాద్: చేపల వేటకు వెళ్లి కడెం వరదలో చిక్కుకుని ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కడెం మండలం కన్నాపూర్‌కు చెందిన తిప్పిరెడ్డి గంగాధర్ (45) శనివారం కడెం గేట్లు ఎత్తడంతో కుమారుడు, మరో వ్యక్తితో కలిసి ప్రాజెక్ట్ గేట్ల దిగువన వెళ్లాడు. రెండు గేట్లు మూసివేయడంతో నీటి ప్రవాహం తగ్గిందని కర్రలతో చేపలు వేటాడేందుకు వెళ్లాడు. అరగంట తర్వాత ఇన్‌ఫ్లో పెరగడంతో అధికారులు సైరన్ మోగించి మరో రెండు గేట్లు ఎత్తారు. సమీపంలో వందలాది మంది కేకలు వేసిన గంగాధర్ ఫోన్ చూస్తుండగా ఒక్కసారిగా చుట్టూ నీళ్లు చేరాయి. బయటకు రాలేక, కొద్ది దూరంలో బండపై నిల్చోని కాపాడండి అంటూ కేకలు వేశాడు. వరద ప్రవాహం పెరగడంతో అందరు చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయాడు. 3 కి.మీ మేర మునుగుతూ, తేలుతూ ఈదుతున్నాడు. పాండ్వపూర్ సమీపంలో కడెం వంతెనను దాటి వెళ్లడం అక్కడే ఉన్నవారు, కానిస్టేబుళ్లు నాగరాజు, వంశీ గమనించారు. చెట్లపొదల పక్క నుంచి కొట్టుకుపోతున్న అతన్ని కాపాడేందుకు పరిగెత్తి ప్రయత్నించారు. సుమారు 3 కి.మీ మేర బురదలో వెళ్లిన ఫలితం దక్కలేదు. అదేవిధంగా దస్తురాబాద్ మండలం భూత్కూర్ పంచాయతీ రాంపూర్ గోదావరి తీర ప్రాంతంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందం గాలింపు చేపట్టింది. ఎస్సై సాయికుమార్, తహసీల్దార్ విశ్వంబర్ అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ దొరకకపోవడం, రాత్రి కావడం, వరద ప్రవాహం పెరగడంతో గాలింపును నిలిపివేశారు. కడెం ప్రాజెక్ట్ వద్ద ఉన్న ఎన్టీఆర్‌ఎఫ్ బృందం స్పందిస్తే వరదల్లో గంగాధర్‌ను బయటకు తీసుకువచ్చేవారని స్థానికులు వాపోయారు. గంగాధర్‌కు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఉపాధి నిమిత్తం బిస్కెట్లు, కేక్‌లు, చాక్లెట్లు తదితర బేకరీ ఐటెమ్స్‌ను షాపులకు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాడు.
కేకలు వేశాం
కడెం గేట్లు దూరాన ఉన్న మేము బయటకు రావాలని కేకలు వేశాం. అతను గమనించలేదు. నేను పోతున్నా అంటూ గట్టిగా ఆరిచాడు. 20 నిమిషాల వ్యవధిలో వరదలో కొట్టుకుపోయాడు. – వినయ్, ప్రత్యక్ష సాక్షి

కడెం వరదలో వ్యక్తి గల్లంతు