
క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి
ఆదిలాబాద్: క్రీడాకారులంతా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని రాష్ట్ర బేస్‌బాల్ సంఘం అధ్యక్షుడు చల్లా హరిశంకర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో తెలంగాణ 5వ సీనియర్ రాష్ట్రస్థాయి బేస్‌బాల్ చాంపియన్‌షిప్ (మహిళలు–పురుషులు) పోటీలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, రెండింటిని సమానంగా స్వీకరించాలన్నారు. క్రీడాభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్నామన్నారు. రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. పది రోజుల పాటు శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తామని వివరించారు. పోటీల్లో రాష్ట్ర జట్టు విజేతగా నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్.శ్వేత మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతోమంది ప్రతిభగల క్రీడాకారులు ఉన్నారని పేర్కొన్నారు. క్రీడల్లో రాణించినవారికి గొప్ప భవిష్యత్తు ఉంటుందన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కలాల శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం శుభపరిణామన్నారు. 33 జిల్లాల నుంచి సుమారు 700 క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో జక్కుల శ్రీనివాస్, అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి డా.కృష్ణ, అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పందిరి జ్యోతి, ఉపాధ్యక్షుడు లోక ప్రవీణ్‌రెడ్డి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు, వ్యాయామ ఉపాధ్యాయులు దయానందరెడ్డి, హరిచరణ్, రామ్‌కుమార్, జిల్లాల నుంచి కార్యదర్శులు, కోచ్‌లు, మేనేజర్లు పాల్గొన్నారు.
తొలిరోజు విజేతలు
పురుషుల విభాగంలో ఆదిలాబాద్ కరీంనగర్ జట్టుపై 6–1తో, హైదరాబాద్ నిర్మల్ జట్టుపై 7–1తో, మహబూబ్‌నగర్ సిద్దిపేట జట్టుపై 7–2తో విజేతలుగా నిలిచాయి. మహిళల విభాగంలో నిజామాబాద్ జట్టు సిద్దిపేటపై 9–0తో, కరీంనగర్ జట్టు మహబూబాబాద్ జట్టుపై 6–5తో, నల్గొండ జట్టు ఆసిఫాబాద్ జట్టుపై 7–4తో విజేతలుగా నిలిచాయి.