
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముల్కల్ల గ్రామ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. హాజీపూర్ ఎస్సై స్వరూప్‌రాజ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. కోటపల్లి మండలం దేవులవాడకు చెందిన నిట్టూరి శశిపాల్ (36) గురువారం ఉదయం ముల్కల్ల శివారులో నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం అతివేగంగా వచ్చి ఢీ కొట్టడంతో త్రీవగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 కు సమాచారం అందించడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి రాత్రి మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుని తండ్రి లస్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
జిల్లా క్రికెట్ అసోసియేషన్‌ను ప్రక్షాళన చేయాలి
మంచిర్యాలటౌన్: జిల్లా క్రికెట్ అసోసియేషన్‌ను ప్రక్షాళన చేయాలని, హెచ్‌సీఏ ఆధ్వర్యంలో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, అక్రమాలపై విచారణ చేపట్టాలని ఓల్డ్ మంచిర్యాల క్రికెట్ క్లబ్(ఓఎంసీసీ) అధ్యక్షుడు బొలిశెట్టి కిషన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శివాజీ మైదానంలో గురు క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం అండర్–17 క్రికెట్ టోర్నమెంట్ పోటీలను కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేశ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గురు అకాడమీ నిర్వాహకులు దుర్గాప్రసాద్, ఎంఏ విజయ్, వివేక్, తూముల ప్రభాకర్, ఆమ్రోస్, ఎడ్ల మల్లేశ్, ఎలుక శ్రీనివాస్, రమేశ్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం క్రికెట్ క్రీడాకారుల కోసం రూ.20 వేల మ్యాట్‌ను కిషన్, ప్రభాకర్ అందించారు.
ఎరువుల కోసం బారులు
చెన్నూర్: చెన్నూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనం వద్ద ఎరువుల కోసం రైతులు బారులు తీరారు. గురువారం ఎరువులు పంపిణీ చేస్తున్నారనే సమాచారం మేరకు పెద్ద సంఖ్యంలో తరలివచ్చారు. వరుసలో ఎక్కువ సమయం ఉండలేక తమ వంతుగా చెప్పులు ఉంచారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు సక్రమంగా ఎరువులు పంపిణీ జరిగేందుకు బందోబస్తు నిర్వహించారు.
యూరియా కోసం రైతుల ఆందోళన
భీమిని: యూరియా సక్రమంగా పంపిణీ చేయ డం లేదని మండలంలోని వెంకటపూర్‌లో జై భీమ్ పరస్పర సహాయక సహకార మార్కెటింగ్ సంఘం ఎదుట రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. రైతులు మాట్లాడుతూ ఈ కేంద్రం నుంచి ఇప్పటివరకు ఒక లోడు మాత్రమే పంపిణీ చేశారని తెలిపారు. నిర్వాహకులు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏడీఏ సురేఖ, ఎస్సై భాస్కర్‌రావు రైతులతో మాట్లాడగా ఆందోళన విరమించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మకాలు చేపట్టాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని ఏడీఏ సురేఖ తెలిపారు. భీమిని ఏవో యమునాదుర్గా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి