
● గతేడాది కంటే సగటున ఒకమీటరు దిగువకు నీటిమట్టం ● లోటు వ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భూగర్భ జలాలు గతేడాది కంటే ఈ ఏడాది ఇంకా దిగువనే ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు ఈ సీజన్‌లో ఆశించిన మేర వర్షపాతం అందించలేదు. జిల్లాలో ఇంకా లోటు వర్షపాతమే నమోదవుతోంది. దీంతో భూగర్భ జలాలు సైతం భూమి లోపలే ఉంటున్నాయి. వర్షాకాలం ఆరంభమై మూడునెలలు కావస్తున్నా గోదావరి నదిలోకి ఇంకా వరదలు రాలేదు. దీంతో నీటివనరుల్లో ప్రవాహం లేదు. వాగులు, వంకలు గరిష్ట నీటితో పారలేదు. చాలా వరకు చెరువులు పూర్తిస్థాయిలో నిండలేదు. గత నెల, ఈ నెలలో వానలు కురిసినప్పటికీ భారీ వర్షాలు లేక నీటి వనరుల్లో సరిపడా నీరు లేదు. దీంతో భూగర్భజలాలు పైకి రావడం లేదు. జిల్లాలో ఫిజోమీటర్లు ఏర్పాటు చేసిన చోట్ల నీటి లభ్యతను లెక్కించి ఏ ప్రాంతాల్లో ఎంత మేర నీళ్లు ఉన్నాయని భూగర్బ జలాల అధికారులు నమోదు చేస్తుంటారు. ఈ లెక్కల ప్రకారం గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది జిల్లాలో సగటున సుమారు ఒకమీటరు లోపలే నీరు ఉండడం గమనార్హం. అత్యధికంగా చెన్నూరు, కోటపల్లి మండలాల్లో సగటును రెండు మీటర్ల లోతుకు ఊట పడిపోయింది. మిగతా మండలాల్లోనూ అన్నింటిలో సగటున లోతు ఒక మీటరు ఉంది.
వరద రాక.. నీరు ఇంకక
ఈసారి వర్షాలు ఆశించిన మేర కురియకపోవడంతో వరదలు వచ్చి చెరువులు, కుంటలు ఉప్పొంగలేదు. దీంతో వరదలు వస్తేనే మళ్ళీ నీటివనరులు నిండి భూమిలోకి నీరు ఇంకే అవకాశం ఉంటుంది. అలా ఇంకిన నీరే భూగర్భ జలాలుగా నిల్వ కానున్నాయి. వీటినే సాగు, తాగునీటికి అవసరమైనప్పుడు వీటిని వెలికితీసుకునే అవకాశం ఉంది. జిల్లా పరీవాహక ప్రాంతాలకు గోదావరి, ప్రాణహిత నదులు, చిన్న, మధ్యతరహా నీటి ప్రాజెక్టులు, చెరువులు, అటవీ, కొండ ప్రాంతాలు నీటి ఇంకుడుకు ప్రధాన ప్రాంతాలుగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో నీరు ఇంకే అవకాశం లేక వృథాగా నీరు వెళ్ళిపోతోంది. ఇంకుడు గుంతలు, సామూహిక గుంతల నిర్మాణం చేపడితే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఈ సారి వర్షాలు తక్కువగా ఉండడంతో నీరు భూమిలోకి ఇంకకపోవడంతో గతంతో పోలిస్తే తక్కువగా ఉంది. అయితే ఆందోళనకర పరిస్థితులేమి లేవని, ఈ నెలలో వర్షాలు కురిస్తే, సాధారణ స్థితికి చేరుకుంటుందని భూగర్భ జలాల అధికారులు పేర్కొంటున్నారు. వాన నీటిని ఒడిసి పట్టి ఇంకుడు గుంతల్లో నీటిని ఇంకేలా చేస్తే నీటి కొరత తీరి, భూమి పైపొరల్లోనే నీరు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
ఫిజోమీటర్లు ఉన్న ప్రాంతాల్లో భూ గర్భ జలాల సగటు (మీటర్లలో)
మండలం గ్రామం గతేడాది జూలై ఈ ఏడాది జూలై
బెల్లంపల్లి బెల్లంపల్లి 15.5 15.98
భీమిని రాంపూర్ 0.76 2.08
చెన్నూర్ చెన్నూర్ 6.85 8.01
చెన్నూర్ కొమ్మెర 1.53 2.62
దండేపల్లి మ్యాదిరిపేట 4.56 4.48
హాజీపూర్ హాజీపూర్ 4.86 5.12
జైపూర్ జైపూర్ 1.77 2.92
జైపూర్ కుందారం 8.75 8.58
జన్నారం ఇందన్‌పల్లి 4.32 3.44
కన్నెపల్లి జన్కాపూర్ 0.02 0.01
కాసిపేట కొండాపూర్ 1.61 3.75
కోటపల్లి కోటపల్లి 15.08 17.52
లక్సెట్టిపేట లక్సెట్టిపేట 0.32 0.98
మందమర్రి మందమర్రి 3.84 4.50
మందమర్రి పొన్నారం 15.41 16.66
నెన్నెల నెన్నెల 5.94 6.76
తాండూరు తాండూరు 14.21 15.54
వేమనపల్లి నీల్వాయి 0.01 0.59
జన్నారం జన్నారం 4.28 5.85
జన్నారం తపాలాపూర్ 2.96 3.09
భీమారం భీమారం 7.84 8.11
మంచిర్యాల మంచిర్యాల 4.22 6.39
నస్పూర్ నస్పూర్ 4.40 6.70
వేమనపల్లి లక్ష్మీపూర్ 3.92 4.25
కన్నెపల్లి నాయకిన్‌పేట్ 5.78 7.44
మొత్తం సగటు 5.54 6.45