
ఇంటర్ ప్రవేశాలకు మరో అవకాశం..!
కళాశాలల్లో జనరల్, వొకేషనల్
విద్యార్థుల ప్రవేశాలు ఇలా...
కళాశాల జనరల్ వొకేషనల్ మొత్తం
మంచిర్యాల 197 246 443
మందమర్రి 93 71 164
కాసిపేట 92 49 141
చెన్నూర్ 175 0 175
బెల్లంపల్లి(గర్ల్స్) 176 0 176
బెల్లంపల్లి 222 215 437
జైపూర్ 107 0 107
జన్నారం 99 0 99
దండేపల్లి 83 0 83
లక్సెట్టిపేట్ 274 181 455
మొత్తం 1518 762 2280
మంచిర్యాలఅర్బన్: ఇంటర్‌లో ప్రవేశాలు పొందే విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. కాలేజీలో అడ్మిషన్ కోసం దరఖాస్తుల గడువును మూడోసారి పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20 లోపు దరఖాస్తులు అందజేయాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. జూన్ 1నుంచి ప్రారంభమైన ప్రవేశాలు జూలై 31తో ముగియగా ఆగస్టు 20 వరకు అడ్మిషన్ల గడువు పొడిగించింది. పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కావడంతో దరఖాస్తుల గడువు మరోసారి పెంచినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ విద్య పూర్తిగా ఉచితం.. పాఠ్యపుస్తకాలు..స్కాలర్‌షిప్‌లు పొందవచ్చంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ కళాశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, నాణ్యమైన బోధన తీరుపై అవగాహన కల్పించారు. ఇంటర్ విద్యాశాఖ అధికారులు ప్రతీ కళాశాల ప్రిన్సిపాల్‌తో ప్రత్యేకంగా సమావేశమై క్షేత్రస్థాయిలో ఏయే చర్యలు చేపట్టాలో అవగాహన కల్పించారు. గతేడాది కంటే ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యార్థులపై శ్రద్ధ చూపుతామని తల్లిదండ్రులకు భరోసానిస్తున్నారు. ప్రవేశాల సంఖ్య పెరిగేలా చర్యలు ముమ్మరం చేశారు.
కార్పొరేట్ కళాశాలలకు దీటుగా...
పదో తరగతి ఫలితాలు వెలువడక ముందునుంచి కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్ల పెంపు ప్రక్రియ వేగవంతం చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో బోధన, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ఎంసెట్ శిక్షణ, రోజువారీగా స్టడీ అవర్ నిర్వహణ, సొంత భవనం, విశాలమైన ఆటస్థలం, ఆహ్లాదకరమైన వాతావరణం, స్టడీ మెటీరియల్, స్కాలర్‌షిప్..ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే సాధ్యమంటూ పాఠశాలల వారీగా వెళ్లి సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు అవగాహన కల్పించడంతో క్రమంగా ఇంటర్‌లో ప్రవేశాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో మూడోసారి గడువు పొడిగించామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఐఈవో అంజయ్య విద్యార్థులకు సూచించారు.
ఈ నెల 20 వరకు గడువు పెంపు
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచన
లక్సెట్టిపేట్‌లో అత్యధికంగా ప్రవేశాలు..
లక్సెట్టిపేట్‌లో కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఆధునిక హంగులతో నూతనంగా భవనం నిర్మించారు. జిల్లాలో గతంలో 170 మంది కూడా దాటని విద్యార్థుల సంఖ్య ఈఏడాది 455కు చేరింది. జిల్లా కేంద్రమైన మంచిర్యాల ప్రభుత్వ కళాశాలలో 443 మందితో తర్వాత స్థానంలో నిలిచింది. బెల్లంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 437 మంది అడ్మిషన్లు పొందారు. ఇలా ఈ ఏడాది ప్రవేశాల సంఖ్య పెరుగుతుండడంతో మూడోసారి అవకాశం కల్పించారు. దీంతో మరింత మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరే అవకాశం లేకపోలేదు.